‘వినోద్ ఫిల్మ్ అకాడమీ’ పై కొత్త నటీనటులను అందులోనూ టాలెంట్ ఉన్న నటీనటులను టాలీవుడ్ కి అందిస్తున్నారు వినోద్ నువ్వుల(Vinod Nuvvula). ఇప్పుడు 6వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ఆయన ‘వినోద్ ఫిలిం అకాడమీ అండ్ స్టూడియోస్’ అనే బ్యానర్ ను స్థాపించి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ‘ప్రొడక్షన్ నెంబర్ 1’ గా ఈ ప్రాజెక్టు ఘనంగా ప్రారంభమైంది.
యువ దర్శకుడు తల్లాడ సాయికృష్ణ దర్శకత్వ పర్యవేక్షణలో, ప్రణయ్‌రాజ్ వంగరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సీనియర్ నటులు ఎల్బీ శ్రీరామ్, దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి..ల క్లాప్ తో సినిమా ఘనంగా ప్రారంభమైంది.రాజశేఖర్ ఆనింగి,డాక్టర్ సుధాకర్, ప్రొఫెసర్ విల్సన్, నటులు &VFA ప్రిన్సిపల్ కిషోర్ దాస్,VFA HOD బబ్లూ, జబర్ధస్త్ జీవన్, సినీ-టీవి నటి అమ్మినేని స్వప్న చౌదరి,పృథ్వీ, VFA Team ఉష శ్రీ, విజయ్ భరత్, విజయ్ గుర్రపు, మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలో ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ..”పరిశ్రమలోకి వేలమంది అడుగుపెడతారు, కానీ సరైన శిక్షణ లేక ఆదిలోనే వెనకబడిపోతుంటారు. వినోద్ కుమార్ నువ్వుల తన అనుభవాన్నంతా రంగరించి విద్యార్థులను తీర్చిదిద్దడం అభినందనీయం అనే చెప్పాలి.కొత్తగా ప్రారంభించిన ఈ సినిమా సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు.
వినోద్ కుమార్ నువ్వుల మాట్లాడుతూ.. “ముందుగా ఈ 5 ఏళ్ళ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ స్పెషల్ థాంక్స్. వినోద్ ఫిల్మ్ అకాడమీ అనేది కేవలం ఒక సంస్థ కాదు, అది నా కల. సినిమాపై మక్కువతో హైదరాబాద్ వచ్చే వేలాది మంది యువత సరైన మార్గదర్శకత్వం లేక ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో 5 ఏళ్ళ క్రితం ఈ అకాడమీని ప్రారంభించాను.
ఈ 5 ఏళ్ళలో చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ నా విద్యార్థులు సాధించిన విజయాల ముందు అవి చిన్నవిగా అనిపించాయి. శిక్షణ ఇవ్వడమే కాకుండా, నా విద్యార్థుల ప్రతిభను వెండితెరపై చూపించాలనే ఉద్దేశంతోనే ‘వినోద్ ఫిలిం అకాడమీ అండ్ స్టూడియోస్’ బ్యానర్‌ను స్థాపించాను. నా మొదటి సినిమాలో పనిచేసేవారంతా నా విద్యార్థులే కావడం ఆనందంగా అనిపిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు.
