విశ్వక్ సేన్.. పక్కా తెలంగాణ కుర్రాడు. ఆ యాస్, భాష, బాడీ లాంగ్వేజ్ భలేగా ఉంటాయి. అయితే ఆ యాసకు దూరంగా వచ్చి విశ్వక్‌సేన్ నటించినా బాగుంటుంది, ఆ కేపబిలిటీ ఉంది అని విమర్శకులు చెబుతుండేవారు. ఇప్పుడు వారు అనుకున్నట్లే విశ్వక్‌సేన్ ఆ జోన్ నుండి బయటకు వచ్చి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కోనసీమ ప్రాంతంలో జరుగుతోంది. చైతన్య కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా గోదావరి జిల్లాల నేపథ్యంలోనే ఉంటుందట. అందుకే సుమారు 40 రోజుల పాటు అక్కడే షూటింగ్ పెట్టుకున్నారట. అమలాపురం మండలం పేరూరులో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో కోనసీమలోని ఆప్యాయత, అనురాగాలు మరువలేనివని విశ్వక్ సేన్ చెప్పాడు. గోదావరి జిల్లాల ప్రజల ఆదరణ, కోనసీమ యాస ఎంతో బాగుంది. ఇక్కడి ప్రజలకు నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందని విశ్వక్‌సేన్ చెప్పాడు.
జర్నలిజంలో మాస్ కమ్యూనికేషన్ చేశానని, అయితే నటన వైపు మక్కువతో ఇటొచ్చేశానని తెలిపాడు. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ 2014లో చిత్రసీమకు పరిచయమయ్యానని, ఇప్పటివరకు పది సినిమాల్లో నటించానని చెప్పాడు. అయితే అన్నింట్లో ‘దాస్‌కా ధమ్కీ’ సినిమా తనకెంతో ఇష్టమని కూడా చెప్పాడు. ఇండస్ట్రీలో తనకు తారక్ అంటే బాగ ఇష్టమని, అతనే తన అభిమాన నటుడని కూడా చెప్పాడు.
విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఈ సినిమాకు తొలుత మంచి టాక్ వచ్చినా ఆ తర్వాత ఆ జోరు కొనసాగించలేకపోయింది. దీంతో ఒకింత నిరాశ ఎదురైంది అనే చెప్పాలి. ఇటీవల ‘బూ’ సినిమా ద్వారా ఓటీటీలోకి వచ్చాడు. జియో సినిమా ఓటీటీలో ఆ సినిమా వచ్చిది. ఇప్పుడు ‘గామి’ అనే మరో సినిమా కూడా చేస్తున్నారు. ‘దాస్ కా ధమ్కీ 3’ కూడా ఉంటుంది అని సమాచారం.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!