టాలీవుడ్ యవ నటుడు విశ్వక్సేన్పై ఇండస్ట్రీలో చిన్నపాటి విమర్శలు ఉన్నాయి. యాటిట్యూడ్ ఎక్కువని, సినిమా డైరక్షన్లో వేలుపెడతాడని.. ఇలా అనుకునేవారు. అయితే దీనిపై ఎక్కడా ఏ దర్శకుడూ స్పందించలేదు. విశ్వక్సేన్ ఇలా అని చెప్పలేదు. అయితే ఇప్పుడు సీనియర్ నటుడు, దర్శకుడు అర్జున్ ఈ విషయాన్ని పాయింట్ అవుట్ చేశారు. తన కూతురు కథానాయికగా తెరకెక్కిస్తున్న సినిమాలో విశ్వక్సేన్ వ్యవహారశైలి నచ్చడం లేదంటూ.. ప్రొఫెషనలిజం లేదంటూ కామెంట్స్ చేశారు. అయితే దీనిపై విశ్వక్ స్పందించారు.
ఓ సినిమా ప్రచార కార్యక్రమానికి వచ్చిన విశ్వక్.. అర్జున్ ప్రెస్ మీట్, అతని కామెంట్స్ గురించి మాట్లాడారు. ‘‘నా అంతటి ప్రొఫెషనల్ నటుడు లేడు, అలాంటి నాకు కమిట్మెంట్ లేదంటున్నారు. ఈ మాట ఒక్క లైట్ బాయ్ చెప్పినా ఇండస్ట్రీ నుండి వెళ్లిపోతా’’ అంటూ స్ట్రాంగ్ కామెంట్ చేశాడు విశ్వక్ సేన్. ఏదో అవకాశం వచ్చేసింది కదా అని సినిమాలు చేయను. ప్రేమతో చేస్తుంటా. సినిమాకు సంబంధించిన అన్ని పనులనూ చూసుకుంటా. ప్రచారాన్ని భుజాలపై వేసుకుని రోడ్లపై తిరుగుతుంటా అని విశ్వక్సేన్ తన గురించి చెప్పుకొచ్చాడు.
కొత్త దర్శకుడు అయినా, అనుభవమున్న దర్శకుడైనా ‘గివ్ అండ్ టేక్’ అనే పద్ధతిలో పనిచేశా. అర్జున్ గారి చిత్రానికీ అదే అనుకుని ప్రారంభించాను. చిత్రీకరణ మొదలయ్యే వారం ముందు నాకు ఈ స్క్రిప్టు అందింది. ఆ తర్వాత ‘సినిమాలో ఫలానా మార్పు చేస్తే బాగుంటుంది’ అని చెబితే నువ్వు వదిలేయ్, నన్ను నమ్ము అంటూ ఏం చెప్పనిచ్చేవారు కాదు. కళ్లుమూసుకుని కాపురం చేసేయ్ అన్నట్టు అనిపించింది సినిమా వ్యవహారం. ఫైనల్లీ ఓ రోజు షూట్‌కు బయలుదేరేముందు ఎందుకో భయమేసింది. అందుకే ‘ఈ ఒక్క రోజు షూటింగ్ రద్దు చేస్తే..
కొన్ని విషయాలు చర్చించుకుందాం’ అని అర్జున్ గారికి మేసేజ్ పెట్టాను. ఆ తర్వాత నేను, మా మేనేజరు ఎన్నిసార్లు అడిగినా ఆయన నుండి సమాధానం రాలేదు. ఆ తర్వాత వాళ్ల మేనేజరు కాల్ చేసి ‘ఇంకేంటి మాట్లాడేది’ అంటూ అకౌంట్ వివరాలు పంపించారు. సినిమా నుండి బయటకు వెళ్తానని నేను చెప్పలేదు. అలాగే ఆ సినిమాను నేను ఆపలేదు అని క్లారిటీ ఇచ్చాడు విశ్వక్. షూటింగ్ ప్రారంభానికి ముందు నేను క్యాన్సిల్ చేయటం తప్పే.
కానీ, నాలుగు రోజులు అయిష్టంగా పనిచేసి తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలనుకోవటం ఇంకా పెద్ద తప్పు అందుకే అలా చేయాల్సి వచ్చింది. ఇక అర్జున్ ప్రెస్ మీట్ విషయానికొస్తే.. సినిమా విషయంలో నాకు ఇబ్బంది అనిపించి నాలుగు గోడల మధ్యే మాట్లాడాను. ఆయనకు అంత గౌరవం ఇచ్చాను. కానీ ఆయన ప్రెస్‌మీట్ పెట్టడం వల్ల నా ఫ్యామిలీ, స్నేహితులు బాధపడుతున్నారు. నేనేం చేయాలి? నా వల్ల మీరు ఇబ్బంది పడి ఉంటే క్షమించండి అని విశ్వక్ సేన్ అర్జున్ను ఉద్దేశించి మాట్లాడాడు. మరి ఈ విషయంలో అర్జున్ ఏమంటారో చూడాలి.