లాక్ డౌన్ చాలా మందికి తమను తాము కొత్తగా ఇన్వెంట్ చేసుకునే అవకాశమిచ్చింది. కొన్ని కొత్త ఆలోచనలకు నాంది పలికింది. మరీ ముఖ్యంగా రచయితలకు, దర్శకులకు ఎప్పుడూ దొరకనంత సమయం, ప్రశాంతత దొరికింది! అదే వాళ్లను కొత్త ఆలోచనల వైపు ఆలోచింపజేసింది. మూస ధోరణి వదిలి ప్రయోగాల వైపు నడిపించింది. అలా సమాజాన్ని ఆలోచింపజేసే ఒక ప్రయోగాత్మక ప్రయత్నమే ఈ విటమిన్ షి. మరి, ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.
కథ: ఖాళీ దొరకకున్నా వీలు కల్పించుకొని మరీ ఫోన్ తో గడిపే కుర్రాడు లియో. ఇతని దిన చర్య మొత్తం అతని కంటే బాగా అలెక్సాకు తెలుసు. అంతగా టెక్నాలజీని వాడేస్తుంటాడు. రికమండేషన్ పై వచ్చిన సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ… అదే ఆఫీస్ లో వైదేహి అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయికి తన ప్రేమ గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఇదిలా ఉండగా అతను అలెక్సా నుండి కొత్తగా కొన్న ఫోన్ లో ఉన్న వాయిస్ అసిస్టెంట్ లైలా పై తన అన్ని పనులకు ఆధారపడడం మొదలుపెడతాడు. చివరికి తన లవ్ గురించి కూడా లైలా దగ్గర సలహాలు తీసుకోవడం మొదలుపెడతాడు. మరి ఇంతలా లైలా మీద డిపెండ్ అయిన లియోను ఆ మనిషి కాని మనిషి( ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్) అయిన లైలా లియోను అతని ప్రేమలో గెలిపించిందా..? లేదా..? అనేదే కథ
సాంకేతికవర్గం & నటీనటుల పనితీరు: జయశంకర్ రాసుకున్న కథ చాలా కాంటెపరరీగా ఉండడంతో అందరూ కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా లియో క్యారెక్టర్ అందరిని రీచ్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది లియోలా స్మార్ట్ ఫోన్ లకు, సోషల్ మీడియాలకు, అలెక్సాలకు అలవాటు పడ్డవారు, అడిక్ట్ అయిన వారే కాబట్టి.! అయితే వైదేహి పాత్ర మాత్రం వైవిద్యంగా ఉంటుంది. నేటి తరాన్ని ప్రతిబింబిస్తూనే… ఏది ఎంతవరకు చేయాలో, ఏ టెక్నాలజీని ఎంతవరకు వాడాలో అంతే వాడుతూ బ్యాలెన్స్ గా బిహేవ్ చేస్తుంది.
మనం చార్జ్ చేస్తేనో, మనం ఇన్ పుట్ ఇస్తేనో పనిచెయ్యని డివైజ్ లపై….అవే మనల్ని నడిపిస్తున్నాయనే భ్రమల్లో బతుకుతున్నాం… దాని నుండి బయటపడాలనే విషయాన్ని, ప్రేమ కథకు జత చేసి చిత్రీకరించడం బాగుంది. అటు చెప్పాలనుకున్న విషయాన్ని, ఎంటర్టైన్మెంట్ ను సమపాళ్లల్లో చూపించాడు దర్శకుడు. ఇక లీడ్ రోల్స్ లో చేసిన శ్రీకాంత్, ప్రాచీలు ఇద్దరూ తమ పాత్రలలో ఒదిగిపోయారు. ఎమోషన్ ను కంటీన్యూ చేసే పాటలు, సీన్ ఎలివేట్ చేసే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వర్కవుటయ్యాయి. ఎడిటింగ్ బాగుంది. సినిమాను కరెక్ట్ లెంగ్త్ లో ప్రజెంట్ చేయడం చాలా ప్లస్ అయ్యింది. డి.ఓ.పి., ఆర్ట్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. చిన్న బడ్జెట్ అయినా మంచి ఔట్ పుట్ ఇచ్చారు.
విశ్లేషణ: విటమిన్ షి ఈ లాక్ డౌన్ సమయంలో చిత్రీకరించబడిన మరొక మంచి చిత్రం. ఖచ్చితంగా నేటి సమాజానికి అవసరమైన చిత్రం.