బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించినా.. ఆశించిన స్థాయిలో పేరు అందుకోలేకపోయిన నటుడు వివేక్ ఒబెరాయ (Vivek Oberoi) . వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుగాసాగే ఆయన.. దాతృత్వంలోనూ ముందుంటారు. ఇక వ్యాపారాల్లో ఆయనే కొట్టేవారే లేరు అని చెబుతుంటారు. అలా అని మొత్తంగా తండ్రి ఆస్తితోనే సాధించారా అనే డౌట్ అస్సలు అక్కర్లేదు. ఎందుకంటే మొత్తంగా ఆయన కష్టపడి సంపాదించిందే. దీని గురించి ఆయన ఇటీవల మాట్లాడారు. తన సేవా కార్యక్రమాలకు ఎవరినీ డబ్బులు అడగకూడదనే ఉద్దేశంతోనే సినిమాలతో పాటు, వ్యాపారాలు చేస్తున్నాను అంటూ వివేక్ ఒబెరాయ్ కామెంట్స్ చేశాడు.
అయితే ఇలా సంపాదించడం తనకు చిన్నతనం నుండే అలవాటు అయింది అని చెప్పాడు. చదువుకునే రోజుల్లో నాన్న సురేశ్ ఒబెరాయ్ పాకెట్ మనీగా రూ.500 అందుకునేవారట వివేక్. అయితే ఆ డబ్బును ఒక్క రోజులోనే ఖర్చు పెట్టేసేవాడట. దీంతో బాధ్యతగా ఉండటం ఎప్పుడు నేర్చుకుంటావ్ అని నాన్న వివేక్‌ను తిట్టారట. డబ్బుని పొదుపుగా, తెలివిగా వాడాలని చెప్పారట. 15 ఏళ్ల వయసులో జరిగిన ఈ సంఘటనతో కోపం వచ్చి ఆ రోజు నుండి నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం మానేశాడల వివేక్.
అప్పటి నుండే పని చేయడం ప్రారంభించారట. అలా వాయిస్ ఓవర్ చెబుతూ, ప్రదర్శనలు ఇస్తూ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడల వివేక్. 17 ఏళ్ల వయసులోనే స్టాక్ మార్కెట్‌పై అవగాహన తెచ్చుకుని అందులో పెట్టుబడులు పెట్టి డబ్బులు సంపాదించాడట. అందుకే సినిమాల్లో అవకాశాలు తగ్గినా ఆర్థికంగా ఇబ్బంది పడలేదు అని తన ప్లానింగ్ గురించి చెప్పాడు వివేక్.
ఇప్పుడు బృందావన్ పాఠశాల నిర్వహణతోపాటు, క్యాన్సర్ బాధితులకు సాయం చేస్తున్నానని చెప్పాడు. ఆర్థికంగా భద్రత ఉండటం కోసం, అలాగే ఎవరినీ చేయి చాచి డబ్బులు అడగకుండా ఉండటం కోసం బిజినెస్‌లో యాక్టివ్‌గా ఉంటాను అని చెప్పాడు. వివేక్ ఒబెరాయ్‌కి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. అలాగే కొన్ని టెక్నాలజీ సంస్థలు కూడా ఉన్నాయి. మొత్తంగా అలా సుమారు 30 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడట వివేక్ ఒబెరాయ్.