కెరీర్ తొలినాళ్లలో ఫ్యాక్షన్ కథలను ఎక్కువగా తెరకెక్కించి మాస్ డైరెక్టర్ గా వి.వి.వినాయక్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆది, దిల్, సాంబ సినిమాలతో వినాయక్ విజయాలను అందుకున్నారు. ఆ తరువాత కాలంలో కథలో యాక్షన్ సన్నివేశాలతో పాటు కామెడీకి కూడా ప్రాధాన్యతనిచ్చి కృష్ణ, అదుర్స్, నాయక్ సినిమాలతో వినాయక్ స్టార్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగించారు. ఠాగూర్, ఖైదీ నంబర్ 150 సినిమాలతో రీమేక్ సినిమాలను కూడా అద్భుతంగా తెరకెక్కించగలనని వినాయక్ ప్రూవ్ చేసుకున్నారు.
ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ పనులతో బిజీగా ఉన్న వినాయక్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి హైదరాబాద్ లో ఛత్రపతి రీమేక్ పనులను మొదలుపెట్టనున్నామని చెప్పారు. నిర్మాత జయంతిలాల్ గడ దగ్గర ఛత్రపతి రీమేక్ హక్కులు ఉన్నాయని హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ కు ఆదరణ ఉన్న నేపథ్యంలో అతనితో సినిమా చేయాలని జయంతిలాల్ గడ భావించారని వినాయక్ చెప్పుకొచ్చారు. విజయేంద్ర ప్రసాద్ హిందీకి తగిన విధంగా ఛత్రపతి రీమేక్ స్క్రిప్ట్ లో మార్పులు చేశారని వినాయక్ తెలిపారు.
ఆర్ఆర్ఆర్ మూవీతో రాజమౌళి బిజీగా ఉండటంతో ఆయనను కలవలేదని త్వరలోనే జక్కన్నను కలుస్తానని వినాయక్ చెప్పుకొచ్చారు. రాజమౌళి సినిమాల్లో ఏదైనా ఒకటి రీమేక్ కోసం ఎంపిక చేసుకోమంటే సింహాద్రిని ఎంచుకుంటానని వినాయక్ అన్నారు. సింహాద్రి మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమా అని గొప్ప కథ అని వినాయక్ చెప్పుకొచ్చారు. పరోక్షంగా ఛత్రపతి కంటే సింహాద్రి కథ బాగుంటుందని వినాయక్ చెప్పకనే చెప్పేశారు.