అన్‌స్టాపబుల్.. అంటూ బాలయ్య ప్రతి వారం వస్తే ఎంత సందడిగా ఉంటుంది చెప్పండి. అలాంటి కటౌట్ ఓటీటీలోకి రావడమే ఒక ఆనందం అంటే.. అంతకుమించిన ఆనందం ఆయన చేసే ఫన్. అందుకే ‘అన్‌స్టాపబుల్’ మొదటి సీజన్ అంత పెద్ద విజయం అందుకుంది. అయితే రెండో సీజన్‌కి వచ్చేసరికి ఏదో తేడా కొడుతోంది. అంతా బాగుంది, అదిరిపోతోంది, బాలయ్యనా మజాకా అంటూ తొలి సీజన్ అప్పుడు అందరూ చప్పట్లు కొడితే.. రెండో సీజన్‌లో అవేవీ కనిపించడం లేదు.
‘అన్‌స్టాపబుల్ 2’ మొదలుపెట్టిన భారీ హంగామా చేశారు. విజయవాడలో భారీ ఈవెంట్ పెట్టారు. సీజన్ కోసం ప్రత్యేకంగా ట్రెజర్ హంట్ లాంటి కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇదంతా తొలి ఎపిసోడ్ ముందు వరకే. తొలి ఎపిసోడ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రావడంతో మంచి హైప్ వచ్చింది. రెండో సీజన్‌కు బ్రహ్మాండమైన ప్రారంభం అంటూ అందరూ మురిసిపోయారు. అయితే ఆ తర్వాత నుండి సమయపాలన అనేది సరిగ్గా లేకుండా పోయింది.
ప్రతి శుక్రవారం వస్తాడు అనుకుంటున్న బాలయ్య.. ఆ నియమేమీ పెట్టుకోలేదు అని రెండు ఎపిసోడ్ల తర్వాత తెలిసిపోయింది. అక్టోబరు 14న అనుకున్నట్లే శుక్రవారం మొదలైన కొత్త సీజన్.. రెండు ఎపిసోడ్ల వరకు బాగానే సాగింది. కానీ ఆ తర్వాత చూస్తే.. వారాలు వాయిదా పడుతూ వచ్చాయి. మూడో ఎపిసోడ్ ఎందుకో ఆలస్యమైంది. దీంతో ఫస్ట్ ఎపిసోడ్‌నే మళ్లీ వేశారు. నాలుగో ఎపిసోడ్ ఒక వారం లేట్ అయ్యింది. ఐదో ఎపిసోడ్ పరిస్థితీ అంతే.
ఇక ఆరో ఎపిసోడ్ దగ్గరకు వచ్చేసరికి ఆ లేట్ ఇంకాస్త లేట్ అయ్యింది. పోనీ ఏడో ఎపిసోడ్ అయినా టైమ్‌కి వస్తాదేమో అనుకుంటే.. అలా కనిపించడం లేదు. ఆదివారం ఈ ఎపిసోడ్ షూటింగ్ అయ్యింది. కాబట్టి శుక్రవారానికి ఇస్తారో లేదో చూడాలి. ఇస్తే ఆనందమే.. లేదంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయడమే. అలా కొత్త ‘అన్‌స్టాపబుల్’ నానా స్టాపులతో సాగుతూ వెళ్తోంది. దీనికి తోడు గెస్టుల్లో స్టార్‌లు లేక కిక్ తగ్గింది అనే మాట కూడా వినిపిస్తోంది.