సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదగడం కంటే కూడా, ఆ స్థాయిని నిలబెట్టుకోవడం మాత్రం అతిపెద్ద సవాల్. ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణించిన పూజా హెగ్దే (Pooja Hegde), అతి తక్కువ కాలంలోనే తన క్రేజ్‌ను కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. తెలుగు, తమిళ సినిమాల్లో అగ్ర హీరోలతో నటిస్తూ, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పూజా, ఇప్పుడు కెరీర్‌లో ఒక గందరగోళ స్థితిలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఆమె తదుపరి అడుగు ఎటు వైపు ఉంటుందనేది బిగ్ డౌట్. పూజా హెగ్దే తెలుగులో మహేష్ బాబు (Mahesh Babu), ఎన్టీఆర్ (Jr NTR), అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్(Ram Charan), ప్రభాస్ (Prabhas) లాంటి స్టార్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.
తమిళంలో విజయ్ (Vijay Thalapathy), సూర్య (Suriya) లాంటి హీరోలతో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, 2022లో ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) సినిమా ఘోరంగా విఫలమవడం ఆమె కెరీర్‌ను దెబ్బతీసింది. ఆ సినిమా తర్వాత టాలీవుడ్ నిర్మాతలు ఆమెను దూరం పెట్టినట్లు సమాచారం. మహేష్ బాబు ‘గుంటూరు కారం’లో (Guntur Kaaram) అవకాశం దక్కినప్పటికీ, షూటింగ్ ఆలస్యం, ఇతర కమిట్‌మెంట్స్ కారణంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ‘గుంటూరు కారం’ తర్వాత పూజా హెగ్దేకు టాలీవుడ్‌లో ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు.
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో (Salman Khan) ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’(Kisi Ka Bhai Kisi Ki Jaan), షాహిద్ కపూర్‌తో (Shahid Kapoor) ‘దేవా’ (Deva) సినిమాలు చేసినప్పటికీ, ఆ చిత్రాలు కూడా విజయం సాధించలేదు. తమిళంలో సూర్యతో ‘సూర్య 44’ (రెట్రో) (Retro) సినిమాలో డీ గ్లామర్ పాత్రలో నటించిన పూజా, అభిమానులను ఆకర్షించలేకపోయింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు, దీంతో పూజా హెగ్దే కెరీర్ గురించి ఆలోచనలో పడింది. ప్రస్తుతం పూజా హెగ్దే బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో (Varun Dhawan) ఓ సినిమా, తమిళంలో దళపతి విజయ్‌తో ‘జన నాయగన్’లో (Jana Nayagan) నటిస్తోంది. అలాగే, రజనీకాంత్(Rajinikanth) ‘కూలీ’ (Coolie) సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది.
అయితే, టాలీవుడ్‌లో అవకాశాలు లేకపోవడం ఆమెకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోయిన పూజా, ఇప్పుడు తన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌పైకి తీసుకురావడానికి కొత్త వ్యూహాలు రచించాల్సిన సమయంలో ఉంది. పూజా హెగ్దే తన గత వైభవాన్ని తిరిగి పొందాలంటే, టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో మళ్లీ అవకాశాలు సంపాదించడం కీలకం. కొత్త దర్శకులతో వైవిధ్యమైన కథలను ఎంచుకుని, తన నటనతో ఆకట్టుకుంటే, మళ్లీ స్టార్ హీరోయిన్ స్థానాన్ని అందుకునే అవకాశం ఉంది. పూజా తదుపరి కర్తవ్యం ఏమిటి, టాలీవుడ్‌లో మళ్లీ ఆమె జోరు చూపిస్తుందా అనేది చూడాలి.