‘‘పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలోనే రావాలి, చిన్న హీరోల సినిమాలు ఓటీటీలోనే రావాలి అనేం లేదు. పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీలోకి వస్తుంటాయి’’ ఈ మాటలు వింటుంటే ఇప్పుడు ఈ చర్చ ఎందుకు? అనే ప్రశ్న మీకు కచ్చితంగా వస్తుంది. మామూలుగా అయితే ఈ చర్చ ఇప్పుడు వచ్చేది కాదు. ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) సినిమా ఫలితం చూశాక ఈ చర్చ మళ్లీ మొదలైంది. దానికి కారణం ‘భారతీయుడు 3’ ఓటీటీలోకి ఇస్తే సరి అనే మాట బయటకు రావడమే.
ఎన్నో అంచనాలతో సుమారు 24 ఏళ్ల తర్వాత వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. మొత్తానికి వాషవుట్ అయిపోయింది అని కూడా అంటున్నారు. తమిళ వెర్షన్‌తో పోలిస్తే తెలుగులోనే ఓపెనింగ్స్ బాగున్నాయి అనే టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో డామేజీ ఎంతో తేల్చుకొనే పనిలో నిర్మాతలు ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘భారతీయుడు 3’ పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది.
ఒకవేళ షూటింగ్ మొదలెట్టకపోతే ‘భారతీయుడు 3’ ఆలోచన అక్కడితో ఆగిపోయేది అని అంటున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే ఉండటంతో.. పూర్తి చేయక తప్పదు. ‘భారతీయుడు 2’ చివర్లో మూడో ‘భారతీయుడు’లో ఏం జరుగుతుందనే విషయాన్ని చూపించారు కూడా. మూడో పార్టులోనే అసలు విషయం ఉందని అర్థమవుతోంది. అయితే వస్తే చూస్తారా అనేది కూడా ప్రశ్నే.
ఈ నేపథ్యంలో సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఇచ్చేస్తే బాగుంటుంది అనే మాట తరచుగా వినిపిస్తోంది ‘భారతీయడు 2’ సినిమా స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ తీసుకొంది. ఆ లెక్కన ‘భారతీయుడు 3’ కూడా వాళ్లకే ఇవ్వొచ్చు / ఇచ్చేశారు అని అంటున్నారు. ఎక్స్‌క్లూజీవ్ రిలీజ్ ఓటీటీలో అని చెప్పి మంచి మార్కెటింగ్ చేసుకోవచ్చు అనే చర్చ కూడా నడుస్తోంది. మరి నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి. అయితే ఇంత పెద్ద సినిమా అలా వచ్చేస్తే అనే మాట మాత్రం అలానే ఉండిపోతుంది.