అల్లు అర్జున్ (Allu Arjun) నెక్స్ట్ సినిమా ఏంటి? ఇదేం ప్రశ్న.. అట్లీ (Atlee Kumar) సినిమా ఓకే అయింది కదా.. 8వ తేదీ అనౌన్స్‌మెంట్ ఉంటుంది కదా అని అంటారా? అయితే మీరు ఇంకా నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) రీసెంట్ అనౌన్స్‌మెంట్ చూడలేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చెప్పింది వింటుంటే అట్లీ సినిమా అయితే వెనక్కి వెళ్లాలి, లేదంటే వేగంగా పూర్తవ్వాలి అని తప్పక అనిపిస్తుంది. ఎందుకంటే మరో ఐదు నెలల్లోనే మేం రెడీ అని నాగవంశీ అంటున్నారు మరి.
‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమా విషయంలో ఇటీవల నాగవంశీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రెస్ మీట్ పెట్టారు మీకు తెలిసే ఉంటుంది. ఆయన వల్లే వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు బతికేస్తున్నాయని.. మీకు అంతగా అనిపిస్తే నా సినిమాల్ని బ్యాన్ చేసుకోండి అంటూ ఓ ఓపెన్ సవాలు విసిరారు కూడా. ఆ సందర్భంగానే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ సినిమాల గురించి కొన్ని కామెంట్లు చేశారు. అవి విన్నాక అట్లీ సినిమా గురించి డౌట్స్ మొదలయ్యాయి.
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో రూపొందనున్న సినిమా గురించి అడిగితే.. పురాణాల ఆధారంగా సాగే కథతోనే ఈ సినిమా రూపొందుతోంది. అక్టోబరు నుండి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది అని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఈ స్పష్టతతో అట్లీ సినిమా పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది. ఎందుకంటే రూమర్స్ ప్రకారం ఆ సినిమా మేలో మొదలవుతుంది అని అన్నారు. అంటే నాలుగు నెలల్లో ఆ సినిమా పూర్తవ్వాలి. అప్పుడు త్రివిక్రమ్ సినిమాకు బన్నీ సిద్ధమవుతాడు.
అట్లీ సినిమా పూర్తిగా మాస్‌గా ఉంటుంది. ఇటు త్రివిక్రమ్ సినిమా పురాణాల నేపథ్యం.. కాబట్టి రెండు లుక్‌ల మధ్య చాలా మేకోవర్ అవసరం. అది జరగాలి అంటే చాలా గ్యాప్ అవసరం. ఈ లెక్కన అట్లీ సినిమా లేకపోవాలి. లేదంటే అక్టోబరులో త్రివిక్రమ్ సినిమాకు లాంఛనంగా కొబ్బరికాయ కొట్టి పక్కన పెట్టాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో?