సినిమా వాళ్లకు వాళ్ల నటీనటుల అసోసియేషన్ ఆఫీసు ఇల్లు లాంటిది అంటారు. ఈ మాట మేం అనడం లేదు. ఎన్నో ఏళ్లుగా అందులో సభ్యులుగా ఉన్న వాళ్లే చెబుతూ వచ్చారు. అలాంటి ఇంటి కోసం మామూలుగా అయితే సినీ కళామ్మతల్లి బడ్డలు ఏం చేయాలి? దీనికి సింపుల్ ఆన్సర్ తలో చేయి వేసి ఇల్లు కట్టించాలి. మిగిలిన ఇండస్ట్రీల సంగతి పక్కన పెట్టి.. కేవలం టాలీవుడ్ సంగతి చూస్తే.. ఇప్పటికీ సొంత ఇల్లు లేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కి.
రెండేళ్ల క్రితం మా ఎన్నికలు జరిగినప్పుడు ‘మా’ భవనం మాత్రమే మెయిన్ టాపిక్. ఎన్నికలు అయ్యాక దీని గురించి చాలా చర్చలు జరిగాయి. ఈ మేరకు ఏవేవో నిర్ణయాలు తీసుకున్నారు అనే మాట కూడా వినిపించింది. అయితే ఇంకా ఎలాంటి అడుగు ముందుపడటం లేదు. మన పరిస్థితి యాజ్ ఇట్ ఈజ్‌గా కాకపోయినా.. తమిళనాట కూడా ఇలాంటి పరిస్థితే ఉంది అని చెప్పాలి. నడిగర్ సంఘం భవనం కోసం ఏడేళ్లుగా అక్కడివాళ్లు ఎదురు చూస్తున్నారు.
ఎప్పుడో ఏడేళ్ల క్రితం ప్రారంభమై నిలిచిపోయిన సంఘం పనులను తిరిగి ట్రాక్ ఎక్కించడానికి నడిగర్ సంఘం ప్లాన్స్ చేస్తోంది. అదే సమయంలో పలువురు స్టార్ హీరోలు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే నటులు కమల్ హాసన్(Kamal Haasan) , విజయ్ (Vijay Thalapathy) రూ.కోటి చొప్పున విరాళం అందించగా.. ఇప్పుడు శివ కార్తికేయన్ రూ.50 లక్షల విరాళాన్ని సంఘం అధ్యక్షుడు నాజర్ (Nassar) , కోశాధికారి కార్తికి (Karthi) అందించారు. దీంతో మరోసారి ‘మా’ సంఘం టాపిక్ చర్చకు వచ్చింది.
ఎక్కడ అసోసియేషన్ ఆఫీసు ఉండాలి అనేది ‘మా’ నిర్ణయం కావొచ్చు. అయితే దీని కోసం డబ్బులు అవసరం అయితే మన స్టార్ హీరోలు ముందుకు వచ్చి, తలో చేయి వేస్తే బాగుంటుంది అనేది తెలుగు సినిమా అభిమానుల ఆలోచన. మరి మన హీరోలు ఎప్పుడు స్పందిస్తారో చూడాలి. అవసరమే లేదు ‘మా’ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన మంచు విష్ణునే (Manchu Vishnu) మొత్తం చూసుకుంటారా అనేది కూడా తెలియాలి.