Kalki : అంత పెద్ద సినిమా ప్రచారం మొదలెట్టకపోతే ఎలా? కల్కి ప్లానేంటి?

మామూలు సినిమాకే నెల రోజులు, 45 రోజుల ముందు ప్రచారం షురూ చేస్తున్న రోజులివి. ఎంతగా ప్రచారం చేస్తే అంతగా జనాల్లోకి సినిమా వెళ్తుంది అనేది వారి నమ్మకం. ఆ మాట నిజం కూడా. అయితే పాన్‌ ఇండియా సినిమాకు, అందులోనూ రూ.500 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాకు ఇంకెంత ముందుగా ప్రచారం చేయాలి చెప్పండి. చాలా ఎక్కువ రోజులే కావాలి అని అంటారు. అయితే ఏమైందో ఏమో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా టీమ్‌ ఇంతవరకు ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు లేదు.

మామూలుగా అయితే కంటెంట్‌ ఉన్నోడికి ప్రచారం అక్కర్లేదు అని అంటారు కదా.. ఇక్కడా ఆ మాట వాడేద్దాం అనుకుంటున్నారామో. నిజానికి ఈ మాట కరెక్టే కానీ.. ఆ స్థాయి సినిమాకు చాలా ప్రచారమే అవసరం. గట్టిగా చూస్తే సినిమాకు 60 రోజులు కూడా లేదు. జూన్‌ 27న సినిమాను రిలీజ్‌ చేయాలని టీమ్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఒకట్రెండు ప్రచారాలు తప్ప.. పెద్దగా జనాల్లోకి సినిమాను తీసుకెళ్లింది లేదు.

టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఇటీవల సినిమా టీమ్‌ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. అంతకుముందు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) పాత్ర గురించి చెబుతూ ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ఆ తర్వాత ఎలాంటి ప్రచార సామాగ్రి టీమ్‌ నుండి బయటకు రాలేదు. దీంతో ఎందుకు ప్రచారం చేయడం లేదు అనే చర్చ మొదలైంది. సినిమా పాటలో, పాత్రల పరిచయమో వరుసగా చేస్తే బాగుండు అనే చర్చ మొదలైంది. అయితే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌  (Nag Ashwin) ఆలోచనలు ఏంటో తెలియడం లేదు.

అయితే, ఇక్కడో విషయం గమనించాలి. సినిమా ప్రచారం అంటూ మొదలయ్యాక టీమ్‌ మామూలు స్పీడ్‌లో చేయదు. ఎందుకంటే ఒకవైపు వైజయంత్రి మూవీస్‌ టీమ్ మరోవైపు రానా, ఇంకోవైపు ఇతర భాషల నుండి సినిమాల్లో నటిస్తున్న నటులు ఇలా చాలామంది రంగంలోకి దిగుతారు. ఆ రోజు త్వరగా రావాలి అనేది అభిమానుల కోరిక.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus