తెలుగు జనాల డబ్బులు కావాలి.. తెలుగులో టైటిల్స్ పెట్టరు. ఎందుకు డబ్బింగ్ సినిమాలు చూడాలి అంటూ గత కొన్ని రోజులుగా మన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కనిపిస్తూనే ఉన్నాయి. ఏకంగా ఓ అగ్ర హీరో సినిమాను డబ్బింగ్ చేసి తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి ‘ఇదీ అసలు విషయం’ అని చెప్పారు. అయితే నిజానికి మన తెలుగు సినిమాల (Tollywood) పేర్లు తెలుగులో ఉంటున్నాయా? అంటే..
చాలా ఏళ్ల క్రితం కూడా ఈ ప్రశ్న టాలీవుడ్‌లో వచ్చింది. అయితే దానిని ఓ సినిమా, ఆ సినిమా హీరో క్యాష్ చేసుకుని సినిమాకు ప్రచారం చేసుకున్నారు. ఇండస్ట్రీ హిట్ కూడా సాధించారు. ఆ విషయం పక్కనపెడితే ఇప్పడు తెలుగులో విడుదలవుతున్న, విడుదల కాబోతున్న సినిమాల పేర్లు తెలుగులోనే ఉంటున్నాయా? కనీసం అక్షరాలు అయినా తెలుగులో రాస్తున్నారా? అంటే..
మీరే కావాలంటే చూడండి.. ఈ ఏడాది భారీ విజయం అందుకున్న ‘కల్కి: 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా టైటిల్‌ను ఇంగ్లిష్‌లోనే ఎక్కువగా ప్రచారం చేశారు. రవితేజ (Ravi Teja) మరో డిజాస్టర్ ‘ఈగల్’ (Eagle) పరిస్థితి కూడా అంతే. ఇక కలక్షన్ల గురించి ఎక్కువగా ఇటీవల మాట్లాడుతున్న నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మించిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మొన్న వచ్చి వెళ్లిపోయిన ‘విశ్వం’ లెక్క మీరే చూసి ఉంటారు.
ఇక ఇప్పుడు రావాల్సిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) .. సంక్రాంతికి వస్తా అంటున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) పోస్టర్లు ఇంగ్లిష్‌తోనే నిండిపోతున్నాయి. పాన్ ఇండియా సినిమాలకు ఇంగ్లిష్ పేర్లు ఓకే.. అయితే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పోస్టర్లు వేయడానికి ఇబ్బంది ఏంటి అనేదే ప్రశ్న. కాబట్టి ముందు మనం మారి.. తర్వాత ఇతర పరిశ్రమలకు చెబుదాం. ఏమంటారు? ఈ క్రమంలో తెలుగులోనే పోస్టర్లు వేస్తున్న కొన్ని సినిమాల వాళ్లను తప్పక అభినందించాల్సిందే.