దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు అనే సామెత మీరు వినే ఉంటారు. ఎక్కడో వాడే ఉంటారు కూడా. సినిమాలలో అయితే ఎక్కువగా ఈ సామెతను హీరోయిన్ల విషయంలో వాడుతూ ఉంటారు. అందుకే అలాంటి విషయాన్నే హీరోలకు అన్వయించేలా వేరే సామెత తీసుకొచ్చాం. అదే ‘పెనం వేడి మీద ఉన్నప్పుడే దోసేలేయాలి. చల్లార వేస్తే రావు’. ఇక్కడ వేడి అంటే క్రేజ్, దోసె అంటే సినిమా. ఇప్పుడు ఈ సామెత ఎందుకు అంటే.. పైన చెప్పినట్లు మంచి క్రేజ్ ఉన్న ఈ సమయంలో ఓ యువ హీరో సినిమాలు చేయడం లేదు.
దీంతో అతనికి ఏమైంది అనే చర్చ మొదలైంది. అతనే మన టాలీవుడ్ జాతిరత్నం నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) . గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. ‘జాతిరత్నాలు’ (Jathi Ratnalu) సినిమాతో భారీ స్థాయిలో విజయం అందుకున్నాడు. అంతకుముందు కూడా విజయాలు ఉన్నాయి అనుకోండి. అయితే ‘జాతిరత్నాలు’ తర్వాత ‘మిసెస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) చేసి మంచి విజయం అందుకున్నాడు. ఈ సమయంలోనే చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి అని కూడా చెప్పారు. వాటిలో కొన్ని అనౌన్స్‌మెంట్ కూడా అయ్యాయి.
కానీ కొన్నాళ్ల క్రితం ఏదో పని ఉంది అంటూ ఆమెరికా వెళ్లిన నవీన్ ఇంకా స్వదేశానికి రాలేదు. దీంతో ఎందుకు రాలేదు, అక్కడేం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు లాంటి ప్రశ్నలు ఎక్కువయ్యాయి. అయితే వీటికి ఆయన సన్నిహిత వర్గాలు అయితే.. ‘త్వరలో’ అనే సమాధానమే ఇస్తున్నారు. గతేడాది నవీన్ యుఎస్ వెళ్లినప్పుడు అక్కడ ఏదో చిన్నపాటి ప్రమాదం జరిగిందట.
దాని నుండి కోలుకొని ఈ ఏడాది ప్రారంభంలోనే వస్తాడు అనే చర్చ సాగింది. కానీ ఏడాదిలో సెకండడాఫ్ స్టార్ట్ అయింది, ఇంకా రాలేదు. దీంతో ఈ క్రేజ్లో మంచి కథలు ఓకే చేసి, సినిమా చేస్తే ఇప్పుడున్న యువ హీరోల స్థాయికి వెళ్లే ఛాన్స్ దాదాపు కోల్పోయాడు అంటున్నారు. మరి ఎందుకు భారత్ రావడం లేదు అనేది క్లారిటీగా తెలియాల్సి ఉంది.