క్రికెట్‌ను జెంటిల్మన్ గేమ్ అని ఎలా అంటారా… సినిమా పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)ను కూడా జెంటిట్మన్ అసోసియేషన్ అంటుంటారు. నటీనటులంతా కలసి ఏర్పాటు చేసిన సంఘం ఇది. ప్రతి అసోసియేషన్‌కి అధ్యక్షుడు ఉన్నట్టే… దీనికీ ఉంటారు. అయితే మాలో ఎన్నికలు జరగకూడదు.. ఏకగ్రీవంగా జరగాలనేది సంఘం పెట్టుకున్న సంప్రదాయం. అయితే గత రెండు పర్యాయాలుగా చూస్తే… ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. ఈసారైనా అలా అవుతుందా అంటే… డౌట్ అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇండస్ట్రీకి పెద్దగా దాసరి నారాయణరావు ఉన్నప్పుడు, ఆయన మాట చెల్లుబాటు అయినప్పుడు ‘మా’లో ఎన్నికలు ఏకగ్రీవంగానే సాగాయి.
ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు చిత్రసీమకు చెందిన పెద్దలంతా చర్చించుకుని, అధ్యక్షుడిని ఎంచుకునేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. `మా` రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక్కో వర్గం నుండి ఒకరు రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికల సమయంలో విమర్శలు కత్తులు దూస్తున్నారు. కొన్నిసార్లు అదుపు తప్పి… మీడియాకెక్కి రచ్చ చేస్తున్నారు. ఆఖరికి ఎన్నికలు జరిగి, అధ్యక్ష పీఠం ఏదో ఓ వర్గానికి దక్కినా.. ఇంకో వర్గ పోరాటం మాత్రం ఆగడం లేదు. విమర్శలు, వాదనలు, కామెంట్లు సాగుతూనే ఉన్నాయి. దీంతో `మా` అంటే వర్గాల మంట అనేలా మారింది. అయితే ఇటీవల చిరంజీవి, మోహన్‌బాబు, కృష్ణంరాజు లాంటివాళ్లు కలసి ఓ వేదిక మీద మనమంతా ఒకటి అని ముక్తకంఠంతో చెప్పారు.
దీంతో ఇకనైనా సమస్య ఆగుతుందేమో అనుకున్నారంతా. రాబోయే మా ఎన్నికల్లో ఏకగ్రీవం ఉంటుందేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే.. మళ్లీ మొదటికొచ్చింది. ‘మా ’ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీలో ఉంటా అని ప్రకాశ్ రాజ్ అధికారికంగా ప్రకటించారు. ఆయన వర్గానికి మెగాస్టార్ చిరంజీవి సపోర్టు చేస్తారని నాగబాబు మాటల్లో తేలిపోయింది. ఇక్కడిదాకా అంతా వెల్ అండ్ గుడ్. కానీ నిన్న మధ్యాహ్నానికి పరిస్థితి వేడెక్కింది. కారణం అధ్యక్షపదవి రేసులో మంచు విష్ణు వస్తున్నారని వార్తలొచ్చాయి. దీంతో ఈసారి కూడా ఏకగ్రీవం కష్టమే అంటున్నారు. ఇప్పటికైనా ‘మా’ పెద్దలు కూర్చొని జెంటిల్మన్ అసోసియేషన్ అంటే ఏంటో చూపించాలి మరి.