ఇంటర్వెల్ సరైన బ్యాంగ్ లేకపోతేనే… ‘ప్చ్’ అంటూ నిరాశపడుతున్న అభిమానులు ఉన్న రోజులివి. అందుకే మనద రచయితలు, దర్శకుడు ఆ విషయంలో బాగా కుస్తీలు పడుతుంటారు. అలాంటిది రెండు పార్టుల సినిమా అంటే తొలి పార్ట్ క్లైమాక్స్‌లో బ్యాంగ్ ఇంకెంత అదిరిపోవాలి. చూసేవాళ్ల కళ్లు, చెవులు… ఇలా మొత్తం శరీరం జలదరించేలా, నమ్మడానికే చాలా సమయం పట్టేలా ఉండాలి. ప్రస్తుతం ఇలాంటి బ్యాంగ్ ‘పుష్ప’కు చాలా అవసరం. దర్శకుడు సుకుమార్ అదే పనిలో ఉన్నారని టాక్ కూడా.
‘పుష్ప – ది రైజ్’ పేరుతో తొలి పార్టును ఈ ఏడాది క్రిస్‌మస్ కానుకగా విడుదల చేస్తామని చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. ఆ దిశగా సినిమాను వేగంగా పూర్తి చేస్తోంది. అయితే ఇక్కడే వచ్చిన డౌట్. ఆ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ బ్యాంగ్ ఏంటి. సులభంగా చెప్పాలంటే ‘బాహుబలి’కి కట్టప్ప లాగా ‘పుష్ప’ కి ఓ కట్టప్ప కావాలి. ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ఉంచి, సినిమా రెండో పార్టు కోసం వేచి చూసేలా చేయాలి.
Why kattappa killed bahubali… ఈ పాయింట్‌తోనే రాజమౌళి ‘బాహుబలి’ రెండో పార్టును జనాల్లోకి ఎక్కించారు. మరిప్పుడు సుకుమార్ ‘పుష్ప’ని ఎలా జనాల్లోకి తీసుకెళ్తారు. అందులో కట్టప్ప ఎవరు? అనేది ఇప్పుడు చర్చ. అయితే దీనికి సమాధానంగా సునీల్ పేరు వినిపిస్తోంది. అప్పటివరకు అల్లు అర్జున్ ఉరఫ్ పుష్పరాజ్ స్నేహితుడిగా ఉండి… ఆఖరులో రంగు మారుస్తాడు అని అంటున్నారు. చూద్దాం… లెక్కల మాస్టారి లెక్కేంటో?