పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా. చాలా ఏళ్ల క్రితం పవన్ కల్యాణ్ స్థాపించిన బ్యానర్ ఇది. దాని మీద వరుస సినిమాలు తెరకెక్కించాలని ఆయన అప్పట్లో ప్లాన్స్ చేశారు. అయితే అవేవీ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ఇతర నిర్మాణ సంస్థలతో కలసి సినిమాలు చేసేందుకు ట్రై చేశారు. అవి కూడా పట్టాలెక్కలేదు. అయితే నితిన్ 25వ సినిమా ‘ఛల్ మోహనరంగా’తో ఇండస్ట్రీలోకి ప్రవేశించింది ఆ బ్యానర్. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది.
ఇదంతా ఓకే కానీ.. ఇప్పుడు ఆ బ్యానర్ గురించి ఎందుకు అనుకుంటున్నారా? మరోసారి ఈ బ్యానర్‌ని పవన్ కల్యాణ్ బయటకు తీశారు. దీని కోసం ప్రత్యేకంగా ఎక్స్ పేజీని కూడా సిద్ధం చేశారు. ఎందుకు, ఏమిటి అనే వివరాలు ఆ బ్యానర్ టీమ్ చెప్పకపోతున్నా.. దాని మీద వరుస సినిమా తెరకెక్కించాలన్న తన పాత ప్లాన్‌ను రీస్టార్ట్ చేయాలని చూస్తున్నారట. దీని కోసం త్రివిక్రమ్ ఆధ్వర్యంలో బృందం సిద్ధంగా ఉందట. యువ దర్శకులు, యువ హీరోలతో వరుస సినిమాలు చేసే ఆలోచనలో పవన్ ఉన్నారట.

గతంలో అయితే ఈ బ్యానర్ మీద తాను కూడా నటించాలని పవన్ ప్లాన్ చేశారు. మూడు పెద్ద సినిమాలు చేయాలని అనుకుంటున్నామని.. అందులో రెండింటిలో పవన్ నటిస్తారని టీమ్ చెప్పారు. ఈ క్రమంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలసి 15 సినిమాలకు ప్లాన్ కూడా చేశారు. కానీ ఇదేదీ వర్కవుట్ కాలేదు. మరిప్పుడు ఏ బ్యానర్‌తో కలసి పని చేస్తారో చూడాలి. పవన్ చేతిలో అయితే ఇప్పుడు ఒకే ఒక సినిమా ఉంది. అదే రామ్ తాళ్లూరి – సురేందర్ రెడ్డి మూవీ.
ఆ సినిమాకు వన్ ఆఫ్ ది బ్యానర్‌గా ఈ సినిమా ఉండొచ్చని టాక్. అది కాకుండా సాయితేజ్, వైష్ణవ్‌తేజ్‌తోపాటు ఇతర యంగ్ హీరోలతో సినిమాలు ఉంటాయని సమాచారం.
