Rayalaseema: గీతా ఆర్ట్స్‌ కదిలింది… మిగిలినవాళ్లెప్పుడు..!

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెబుతుంటారు పెద్దలు. దీన్ని మన టాలీవుడ్‌ జనాలు బాగా అర్థం చేసుకుని మన దగ్గర సినిమాలు చేసి హిట్‌ కొట్టి.. పాన్‌ ఇండియా అంటూ పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. అయితే ‘ఇంట సాయం చేసి… తర్వాత బయట సాయం చేయాలి’ అనే మాటను ఎవరైనా చెబుతారేమో అని ఎదురు చూస్తున్నారా? పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా కష్టం వస్తే… మేమే ముందుంటాం అని మాటలు చెబుతూ ఉంటారు. కానీ కష్టం వచ్చినప్పుడు వేగంగా స్పందించడమూ అంతే ముఖ్యం.

అప్పుడప్పుడు వార్తలను ఫాలో అయ్యేవాళ్లకు కూడా… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని వర్షాలు, వరదల గురించి బాగా తెలుసు. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో వర్షం సృష్టించిన బీభత్సం టీవీల్లో చూసే ఉంటారు. సోషల్‌ మీడియాలో అయ్యో అని అనే ఉంటారు. సినిమా వాళ్లు కూడా అయ్యో అనుకోకూడదు. ఎందుకంటే అక్కడ ఇల్లు కొట్టుకుపోయి, పంటుల ఊడ్చుకుపోయి, కుటుంబాలకు కుటుంబాలు అనాథలైపోయాయి. మరింత జరుగుతున్నా ఇప్పటివరకు టాలీవుడ్‌ నుండి వచ్చిన సాయం ₹10 లక్షలు మాత్రమే అంటే నమ్ముతారా?

అవును అది కూడా ప్రకటించింది ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌. అంతకుమించి ఇంకెవరూ స్పందించలేదు. ఏపీ ప్రభుత్వం… ఏకంగా ₹1000 కోట్లు తక్షణ సాయంగా ఇవ్వండి అంటూ కేంద్రాన్ని వేడుకొంది. ఇది చాలు కదా నష్టం అంచనా వేయడానికి. పక్కన తమిళనాడు రాజధాని చెన్నైలో వరదలు వచ్చినప్పుడు సాయం చేయడానికి తెలుగు హీరోలు ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు. ఆ మధ్య స్టాలిన్‌ తమిళనాడు సీఎం అయినప్పుడు ఎదురెళ్లి హీరోలు వచ్చి విరాళం ఇచ్చారు.

మన దగ్గరకు వచ్చేసరికి ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్‌ నుండి అలాంటి సపోర్టు ఇప్పటివరకు అయితే కనిపించలేదు. ఇటీవలే జరిగింది కదా… అప్పుడే ప్రకటించేయాలా? అంటారా. సాయం చేయడం ఎంత ముఖ్యమో, అవసరమైన సమయంలో వేగంగా చేయడమూ అంతే ముఖ్యం. ఈ విషయంలో మన హీరోలు ఈ రోజు నుండైనా స్పందించాలని కోరుకుందాం. ఎందుకంటే చేసే సాయం… తమ సినిమాలకు డబ్బులిచ్చి టికెట్లు కొని చూసే జనాల కోసమే కదా.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus