సినిమా పరిశ్రమలో వారసత్వం సహజమే. స్టార్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరోలు మంచి హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. అయితే అలా వచ్చిన వాళ్లంతా విజయాలు సాధించారు అంటే తప్పే అని చెప్పాలి. మరోవైపు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తమ నటనతో మంచి అభిమానులు సంపాదించుకున్నారు. స్టార్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చే యంగ్ హీరోలకు ఒక సౌకర్యం ఉంటోంది. ఫ్యామిలీ మెంబర్ల రిఫరెన్సులు వాడేసుకుని అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. అయితే అది సమపాళ్లలో ఉండాలి. కాస్త ఎక్కువైతే తట్టుకోలేం.
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన కొత్త కథానాయకుడు వైష్ణవ్ తేజ్. ఇటీవలే అతని మూడో చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అంతగా ఆకట్టుకోని ఈ సినిమా ఫ్లాప్ దిశగా వెళ్తోంది. ‘కొండపొలం’ ఇచ్చిన షాక్.. దీంతోనైనా రికవర్ అవుతుందనుకుంటే ఆ సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఇదొకవైపు అయితే.. మరోవైపు ‘రంగ రంగ..’ సినిమాలో కొన్ని సన్నివేశాలపై నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. మెగా రిఫరెన్స్‌లు ఎక్కువైపోయి, ఇబ్బందిపెడుతోంది అని అంటున్నారు. అలా అనడం వెనుక వైష్ణవ్‌తేజ్ తప్పు కూడా ఉంది.
‘రంగ రంగ వైభవంగా’ సినిమాలో వైష్ణవ్ తేజ్ పదే పదే చిరంజీవి పాత పాటలు హమ్మింగ్ చేస్తూ కనిపిస్తాడు. సమయంతో సంబంధం లేకుండా హీరోయిన్ ఎదురుగా ‘అభిలాష’లోని ‘నవ్వింది మల్లెచెండు…’ సాంగ్‌కు డాన్స్ చేస్తాడు కూడా. అంతే కాదు వైష్ణవ్, కేతిక వీడియో కోచ్ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్. సమంత పాట కనిపిస్తుంది. ఇవన్నీ మెగా ఫ్యామిలీ రిఫరెన్స్‌లు చూపించడానికే చేశారు అని అర్థమైపోతుంది.
దీంతో వైష్ణవ్‌తేజ్‌కు సోషల్ మీడియాలో చురకలు పడుతున్నాయి. ‘నీలో టాలెంట్ ఉంది. దాన్ని నమ్ముకోకుండా ఈ రిఫరెన్స్‌లు ఎందుకు?’ అని కామెంట్స్ చేస్తున్నారు. పరిశ్రమ విశ్లేషకులు కూడా ఇంచుమించు ఇదే మాట అంటున్నారు. అంతేకాదు ‘ఉప్పెన’తో రికార్డు ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్.. తర్వాతి రెండు సినిమాలు ఫెయిలై.. ఇబ్బందుల్లో ఉన్నాడు. దీంతో కథల ఎంపిక విషయంలో క్లియర్‌గా ఉంటే ఈ రిఫరెన్స్‌ల అవసరం ఉండదు కదా.