‘సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎవరూ ఏమీ మాట్లాడొద్దు’… ఆ మధ్య ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన తర్వాత ప్రముఖ నటుడు చిరంజీవి చెప్పిన మాట ఇది. పెద్దాయన మాట అనుకొని టాలీవుడ్‌లో చాలామంది ఆ విషయం గురించి మాట్లాడలేదు. అయితే ఆయన ఇంట్లో వాళ్లే ఆయన మాటకు ఎదురు చెబుతున్నారా? నాగబాబు వీడియోలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. రీసెంట్ ఆయన విడుదల చేసిన రెండు వీడియోలే దీనికి సాక్ష్యం.
‘భీమ్లా నాయక్’ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును, ఆ మంత్రుల మాటల్ని విమర్శిస్తూ నాగబాబు కామెంట్స్ చేశారు. టాలీవుడ్‌లో ఏపీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నవారు నాగబాబు ప్రవర్తనతో మళ్లీ యాక్టివ్ అయ్యారని అంటున్నారు. ఒకరిద్దరు బహిరంగంగానే విమర్శలకు సిద్ధమవుతున్నారు. దీంతో చిరంజీవి మళ్లీ చిక్కులో పడినట్లు అనిపిస్తోంది. ‘శుభం కార్డు పడింది’ అంటూ చిరంజీవి చెప్పిన మాట ఇక కలే అవుతుందని అని కూడా అంటున్నారు పరిశ్రమ పరిశీలకులు. చిరంజీవి ఓవైపు నుండి శాంతి జపం, నమస్కార సూత్రం, గౌరవ నియమం లాంటివి పెట్టుకుంటూ ముందుకెళ్తుంటే ఇటు నాగబాబు ఇలా మాట్లాడటం సరికాదు అంటున్నారు.
చిత్రసీమ ఎవరికీ తొత్తు కాదు.. అధికార దుర్వినియోగం సహించం.. కావాలంటే ఏపీలో సినిమాల్ని బ్యాన్ చేసుకోండి, మాకేం నష్టం లేదు అంటూ ఓ వీడియోలో ఆవేశంగా మాట్లాడారు నాగబాబు. కావాలంటే మేం మా సినిమాల్ని ఓటీటీలో విడుదల చేసుకుంటాం అని కూడా అన్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం మళ్లీ టికెట్ ధరల విషయాన్ని వెనక్కి తీసుకెళ్తుందేమో అని భయపడుతున్నారు. దీంతో నాగబాబును కంట్రోల్ చేయడం మంచిదని చిరు వర్గీయులు అంటున్నారు. రెండో వీడియో తర్వాత నాగబాబుతో చిరంజీవి మాట్లాడారనే ప్రచారమూ జరుగుతోంది.
అయితే ఇక్కడో విషయం ఉంది. ఏపీ ప్రభుత్వం ఎన్ని లాజిక్‌లు చెబుతున్నా… ‘భీమ్లా నాయక్’ మీద కక్ష తీర్చుకోవడానికే టికెట్ ధరల జీవో ఇవ్వలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సుమారు ఇలాంటి అభిప్రాయంతోనే నాగబాబు ఆ కామెంట్స్ చేశారు అని కూడా అంటున్నారు. ఎవరో లేరని ప్రభుత్వంలో ఏ పనులూ ఆగవు అంటుంటారు. మరి జీవో ఎందుకు ఆగింది అనేది వారికే తెలియాలి. అయితే ఇక్కడో విషయం… సినిమా టికెట్ ధరల విషయంలో పవన్ కల్యాణ్ మాత్రం ఇటీవల కాలంలో ఎక్కడా మాట్లాడటం లేదు.
‘భీమ్లా నాయక్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో సైతం పవన్ స్పందించలేదు. దీంతో చిరంజీవి మాటల విషయంలో ఓ తమ్ముడు ఇలా… ఇంకో తమ్ముడు ఇలా అని అనుకుంటున్నారు.