సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయకపోతే ఏమవుతుంది? ఆ సినిమా టీమ్‌కి ఏమవుతుందో మనకు తెలియదు కానీ.. అభిమానులకు మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది. చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది. అయితే అనుకున్న సమయానికి రాకపోవడం అనేది… ఒకటి కాదు, రెండు కాదు వరుసగా ఐదారు సినిమాలకు జరిగితే ఆ కోపం నషాలానికి అంటేస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిని అనుభవించిన ప్రేక్షకులు ప్రభాస్ అభిమానులు. ‘సలార్’ సినిమా వాయిదా పడిందనే వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా ప్రభాస్ ప్లానింగ్ విషయంలోనే విమర్శలు వస్తున్నాయి.
‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు (Prabhas) ప్రభాస్. అయితే ఆ సినిమాతోపాటే వాయిదాల పరిస్థితి కూడా ప్రభాస్‌కు మొదలైంది అని చెప్పాలి. ‘బాహుబలి 1’ కానీ ‘బాహుబలి 2’ కానీ అనుకున్న సమయానికి రాలేదు. అవి రాజమౌళి సినిమాలు కాబట్టి లేట్ అవ్వడం అనేది వాటి జన్మహక్కు అని చెప్పొచ్చు. కాబట్టి లేట్ అయ్యాయి అనుకుందాం. కానీ ఆ తర్వాత ప్రభాస్ చేసిన సినిమాల్లో ‘సాహో’ తప్ప ఇంకేవీ అనుకున్న సమయానికి విడుదల కాలేదు. కావాలంటే ప్రభాస్ ఫిల్మోగ్రఫీ చూడండి మీకే అర్థమైపోతుంది.
‘రాధేశ్యామ్’ సినిమాకు చెప్పినన్ని రిలీజ్ డేట్‌లు ఇంకే సినిమాకు చెప్పలేదని చెప్పాలి. కరోనా పరిస్థితుల వల్ల ఆ సినిమా వాయిదా పడి ఉండొచ్చు కానీ.. రిలీజ్ డేట్‌లు అయితే మారాయి. ఇక ‘ఆదిపురుష్’ సినిమా విషయం గురించి ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. ఈ సినిమాను కూడా వాయిదాలు వేస్తూ రిలీజ్ చేశారు. ఆ రెండు సినిమాల ఫలితాల గురించి తెలిసిందే. పోనీ అవన్నీ మరచిపోదాం ‘సలార్’ కోసం వెయిట్ చేద్దాం అనుకుంటే.. ఇప్పుడు ఆ సినిమాను కూడా వివిధ కారణాల వల్ల వాయిదా వేశారు అంటున్నారు.
పోనీ తర్వాతి సినిమాలైనా టైమ్‌కి వస్తాయి అనుకుంటే ఇప్పటికే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కూడా వాయిదా పడుతుంది అని అంటున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమా వస్తుందన్నారు కానీ.. వచ్చే అవకాశం లేదు అని అంటున్నారు. ‘సలార్ 1’ లేట్ అయ్యింది కాబట్టి… ‘సలార్ 2’ కూడా లేట్ అవుతుందని చెప్పేయొచ్చు. ఇక మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమా సంగతి సరేసరి. సినిమా షూటింగే వాయిదాలు పడుతూ వస్తోంది. ఇదంతా చూస్తుంటే ప్రభాస్ ప్లానింగ్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి, వెంటనే సరిచేసుకోవాలి అనే డిస్కషన్ నడుస్తోంది.