ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల పరిస్థితి, ముఖ్యంగా నిర్మాతల పరిస్థితి ఏంటి అంటే… ‘ఏమో ఏమేమో’ అనాలని అనిపిస్తోంది. సోషల్ మీడియాలో కొంతమంది అంటున్న మాటల ప్రకారం చెప్పాలంటే.. తేలు కుట్టిన దొంగలాగా మారింది అని చెప్పుకొచ్చు. ఆ మాటను మేం తీసుకోవడానికి కారణం కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల మన తెలుగు సినిమాలు చేస్తున్న వసూళ్ల వివరాలే. తెలంగాణతో పోలిస్తే అక్కడ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు అనేది ఇక్కడ విషయం. హిట్ టాక్ రాని సినిమాల వసూళ్ల గురించి మనం చర్చిస్తే…
తప్పవుతుంది. కానీ మంచి విజయం సాధించింది అని పరిశ్రమ పరిశీలకులు చెబుతున్న సినిమాల వసూళ్లు కూడా అక్కడ అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు. ఫర్వాలేదనిపించుకున్న‘రిపబ్లిక్’, ‘పెళ్లిసందD’… బాగుంది అనిపించుకున్న ‘లవ్‌స్టోరీ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’వసూళ్లు ఏపీలో ఏమాత్రం బాగోలేవట. అంటే థియేటర్‌కు జనాలు రావడం లేదని కాదట. వస్తున్న జనాల నుండి థియేటర్లకు, తద్వారా నిర్మాతలకు డబ్బులు రావడం లేదట. దానికి కారణం మనకు తెలిసిన విషయమే. అక్కడ ఉన్న బీసీనాటి టికెట్ల రేటు.
కరోనా కాలంలో అక్కడ టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఎన్ని వినతులు వెళ్లినా పెంచలేదు. ఇప్పుడేమో ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్ వచ్చాక… అప్పుడు పెంచుతారనే మాటలు వినిపిస్తున్నాయి. మరి అప్పటివరకు ఇదే తక్కువ రేటుతో థియేటర్లు నడిపితే… వాళ్లకు, డబ్బులు పెట్టిన నిర్మాతలకూ నష్టమే. ఈ మాటను నిర్మాతలు కూడా కాదనడం లేదు. కానీ ఏపీ ప్రభుత్వం మాకు చాలా సాయం చేస్తోంది అంటూ ట్వీట్లతో ఊదరగొడుతున్నారు. ఇదంతా చూస్తుంటే మన టాలీవుడ్ నిర్మాతల కష్టం పగోడికి కూడా రాకూడదు అనిపిస్తోంది కదా. ఏం చేస్తాం అంతే మరి.