రాజమౌళితో సినిమా అంటే.. ఏళ్ల తరబడి డేట్స్ ఇవ్వాలి అంటుంటారు టాలీవుడ్ జనాలు. గతంలో ఈ మాట లేనప్పటికీ ‘బాహుబలి’ సిరీస్ సినిమాల తర్వాత ఎక్కువగా వినిపిస్తుంది. కారణం బాహుబలికి ఆయన ఐదారేళ్ల సమయం తీసుకోవడమే. సినిమా స్పాన్ పెద్దది అవ్వొచ్చు. రెండు భాగాలుగా తీసుండొచ్చు.. కానీ అన్నేళ్లా అని అందరూ అనుకున్నారు. అయితే సినిమా ఫలితం ఆ టైమ్‌ని మరపించేసింది. అయితే ఆ తర్వాత ఎంచుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’కి మూడేళ్లు పట్టేస్తోంది. ఇందులో ఒక సంవత్సరం కరోనానే తినేసింది అనుకోండి. ఇక్కడ విషయం సమయం కాదు… హీరోల విషయంలో రాజమౌళి ఆలోచన.
రాజమౌళి సినిమా మొదలుపెడితే… ఆ హీరో మరో సినిమా చేసే అవకాశం పెద్దగా ఉండదు అంటారు. ప్రభాస్ ఆరేళ్లపాటు మరో సినిమా లేకుండా ఇందులోనే ఉన్నాడు. అయితే రానా మాత్రం మధ్యలో మరికొన్ని సినిమాలు చేసి వచ్చాడు. దీంతో ఆ రోజుల్లోనే ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటని చాలామంది నెటిజన్లు ప్రశ్నించారు. ఎప్పటిలాగే వాటిని ఎవరూ పట్టించుకోలేదు. సినిమా లుక్ బయటికి రాకూడదని అలా చేశారు అని కొంతమంది చెప్పుకొచ్చారు.
అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ దగ్గరకి వచ్చేసరికి రాజమౌళి ప్లానింగ్ మొత్తం మారినట్లుంది. కారణం కొవిడ్ కావొచ్చు, బాహుబలి అనుభవం కావొచ్చు. తన హీరోలను వేరే ప్రాజెక్టులు చేసుకోవడానికి రాజమౌళి ఓకే చెబుతున్నాడు. రామ్‌చరణ్ ఓ పక్క ‘ఆచార్య’ షూటింగ్ చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ అయితే ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో చేసుకుంటున్నాడు. నిజానికి ‘బిగ్‌బాస్’ హోస్ట్‌గా ఎన్టీఆర్ తప్పుకోవడానికి రాజమౌళి సినిమా ఒప్పుకోవడమే కారణం, సినిమా ఓకే చెప్పాక.. వేరే షోస్ చేసుకోవడం కష్టం కదా అని అన్నారు. మరిప్పుడు రాజమౌళిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో. అప్పుడు ప్రభాస్ విషయంలో కుదరనిది.. ఇప్పుడు రామారావు, రామ్‌చరణ్ విషయంలో కుదురుతోందా?