విలన్ ఎంత బలంగా ఉంటే… హీరో పాత్ర అంతకంటే బలంగా ఉంటుంది అంటుంటారు. ఈ విషయాన్ని చాలా సినిమాలు రుజువు చేశాయి. ఇటీవల కాలంలో బలమైన విలన్స్ అంటే గుర్తొచ్చే సినిమాల్లో బోయపాటి సినిమాలు కూడా ఉంటాయి. ఆయన కూడా విలనిజానికి భయంకరంగా చూపించడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంటారు. పాత్ర కనిపించే విధానం, మాడ్యులేషన్, డ్రెస్సింగ్… ఇలా అన్నింటా తనదైన ముద్ర వేస్తారు. బోయపాటి ఆలోచనలకు తగ్గట్టుగానే ఇప్పటివరకు ఆయన సినిమాల్లో విలన్లు కనిపించారు.
‘లెజెండ్’లో జగపతిబాబు చూపించిన విలనిజాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోరు. ఇక రీసెంట్ హిట్ ‘అఖండ’లో శ్రీకాంత్ పాత్ర చూపించిన విలనిజం అయితే కలలోకి వస్తుంది అంటున్నారు. ఆ మధ్య శ్రీకాంత్ కూడా ఇదే మాట చెప్పారు. ఈ సినిమా తర్వాత మహిళలు తన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారని. అయితే ఆయన మీదేమో కానీ… బోయపాటి మీద కోపం వచ్చే అవకాశం ఉంది. ‘అఖండ’లో సినిమాలో బాలకృష్ణలో డబుల్ హీరోయిజం చూపించారు. ఎలివేషన్లు, ఎమోషన్లు, యాక్షన్ సీక్వెన్స్… ఇలా అన్నింటా కొత్త బాలయ్యను చూశాం.
ఇక విలనిజాన్ని డబుల్ చేసే ఉద్దేశంలో బోయపాటి తీసిన కొన్ని సీన్లు ఇబ్బందిపెట్టేవిగా ఉన్నాయి. ఆరేళ్ల కొడుకు ముందు తల్లిని మానభంగం చేయడం, తల్లిని భయపెట్టడానికి చిన్నపిల్లాడి తలపై సుత్తితో కొట్టడం లాంటివి ఇబ్బందికరంగా ఉన్నాయి. విలన్ మూర్ఖుడు అని చెప్పడానికి… ఇంత వికృతంగా ప్రవర్తించేలా చేయాలా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.