ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విడుదల చేసే జీవోలు అందరికీ వర్తిస్తాయి. ఇది ఎవరూ కాదనలేని విషయం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయంలో ఇంకోలా ఉంటుందా? ఏమో అవుననే అంటున్నారు నెటిజన్లు. అయితే ‘హరి హర వీరమల్లు’ సినిమా వచ్చాక దీనిపై ఫుల్ క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఆ సినిమాకు జీవోలకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? చాలానే ఉందని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది.
దీంతో విడుదల కూడా అదే స్థితిలో కొనసాగుతోంది. అయితే వచ్చే దసరాకు కానీ, సంక్రాంతికి కానీ విడుదల చేయాలని చిత్రబృందం అనుకుంటోందని వార్తలొస్తున్నాయి. ఆ సినిమా వస్తే ఏపీ ప్రభుత్వం డొల్లతనం మరోసారి బయటపడుతుందని అంటున్నారు నెటిజన్లు. పేదలకు అందుబాటులో సినిమా అనే పేరుతో సుమారు ఏడాది పాటు టాలీవుడ్‌ను ఏడిపించి కొన్ని నెలల ముందే టికెట్ల ధరలను సవరించింది ఏపీ ప్రభుత్వం. చిన్న సెంటర్లలో ₹5, ₹10, ₹20 రేట్లు పెట్టి సినిమాలు వేయమన్నారు. దీంతో చాలా థియేటర్లు మూతలుపడ్డాయి.
అయితే చిరంజీవి నేతృత్వంలోని సినిమా పెద్దల కష్టం మూలంగా తిరిగి దాదాపు పాత ధరలు వచ్చాయి. అంతేకాదు ఐదు షోలు వచ్చాయి, ప్రత్యేక షోలు, టికెట్ ధర ప్రత్యేక పెంపు కూడా వచ్చాయి. అయితే వాటి కోసం కొన్ని నిబంధనలు పెట్టింది వైసీపీ సర్కారు. హీరో రెమ్యూనరేషన్ లెక్కలోకి తీసుకోకుండా సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు ఉండాలి అనేది ప్రధానమైన మెలిక. ఇది కాకుండా ఏపీలో షూటింగ్ కనీసం 20 శాతం జరిగి ఉండాలనే కాన్సెప్ట్ కూడా ఉంది. దీనికి తగ్గట్టు కొన్ని సినిమాలు ఏపీ వెళ్లి షూటింగ్‌లు చేస్తున్నాయి.
ఈ జీవో రావడానికి ముందు చిత్రీకరించిన సినిమాలకు ఈ జీవోలోని 20 శాతం షూటింగ్ లంకె వర్తించదు అని చెప్పారు. అయితే మరో పాయింట్‌ను కూడా ఏపీ ప్రభుత్వం వదిలేస్తోంది. అదే సినిమా బడ్జెట్ లెక్క. హీరోల రెమ్యూనరేషన్ లెక్కలోకి తీసుకోకుండా సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు ఉండాలి అన్నారు. కానీ ఇటీవల విడుదలైన ‘ఆచార్య’ కానీ, ఈ రోజు (12/5/22)న వస్తున్న ‘సర్కారు వారి పాట’ కానీ ఈ కోవకు రావు. బడ్జెట్ లెక్కలు ఆ టైప్‌లో ఉండవు.
కానీ టికెట్ రేట్లు విషయంలో ఉదారంగా వ్యవహరించారు. టికెట్ రేట్లు పెంచుకోండి అంటూ జీవోలు ఇచ్చారు. దీంతో ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రభుతమే తుంగలో తొక్కినట్లు అయ్యింది. చిరంజీవి, మహేష్, ప్రభాస్ తదితరులు ఆ మధ్య వైఎస్ జగన్‌ను కలవడం, ఆయన పట్ల పరోక్షంగా సానుకూలత చూపించడం వల్లే ‘ఆచార్య’, ‘సర్కారు వారి పాట’ సినిమాలకు ఈ అదనపు సౌలభ్యం కల్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ లెక్కన ‘హరిహర వీరమల్లు’ వస్తే ఇలానే చేస్తారా? అనేది నెటిజన్ల ప్రశ్న. అప్పుడు నిబంధనల పేరు చెప్పి రేట్ల పెంపు రాకుండా అడ్డుకుంటారేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ను తమ రాజకీయ ప్రత్యర్థిగా చూడటం వల్లే ఇలా చేస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఆ సినిమా వస్తే కానీ ప్రభుత్వ జీవోలు ఎలా పని చేస్తాయో తెలియదు.
Most Recommended Video
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!