ఓ మోస్తారు అంచనాలతో వచ్చి.. ఇబ్బందికర ఫలితం అందుకున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. పవన్ కల్యాణ్ – నిధి అగర్వాల్ – జ్యోతి కృష్ణ – క్రిష్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా గత వారం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా కొత్త హంగులు, పాత రేట్లతో నేటి నుండి థియేటర్లలో రాబోతోంది. దీంతో గత వారం సాధించిన ఫలితం ఈ వారం ఏమైనా కాస్త మారుతుందా? ఇంకాస్త జనాలు థియేటర్లకు వస్తారా? అనే అంచనాలు, ఆశలు వస్తున్నాయి.
జులై 24న విడుదలైన ‘హరి హర వీరమల్లు’ సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. సినిమా విషయంలో కొంచెం డల్‌నస్ కనిపించడానికి కారణం సినిమా సెకండాఫ్ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నాణ్యత తగ్గడమే అని విమర్శలు వచ్చాయి. ఇక కొత్త వారంలో పాత ధరలు పెడితే బాగుండు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అవన్నీ సినిమా టీమ్ దగ్గరకు వెళ్లినట్లున్నాయి. ఈ రెండూ చేసి ఈ రోజు నుండి కొత్త వెర్షన్‌ని, పాత ధరలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
జులై 28 నుండి ‘హరి హర వీరమల్లు’ సినిమా టికెట్లు ఇంతకుముందు ధరలకు లభించనున్నాయి. ఈ మేరకు బుక్‌మై షో, డిస్ట్రిక్ యాప్‌లలో మార్పులు చేసేశారు. సినిమా విడుదల సందర్భంగా సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. వారం దాటినంత వరకు ఈ కొత్త రేట్లే ఉంటాయి అని అనుకుంటుంఏ.. సోమవారం నుంచి ఎలాంటి పెంపు లేకుండా సాధారణ ధరకే టికెట్లు విక్రయిస్తున్నట్లు అర్థమైంది. సింగిల్ స్క్రీన్‌లలో బాల్కనీ రూ.175, మల్టీప్లెక్స్‌లలో రూ.295కే టికెట్లు లభించనున్నాయి.
ఇక ఇంప్రూవ్ చేసిన కంటెంట్‌ను సినిమాలో ఈ రోజు నుండి చూడొచ్చు అని టీమ్ ఆదివారం రాత్రి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ఆలోచనలో ఏమన్నా మార్పులు వస్తాయా? థియేటర్లు నిండుతాయా అనేది చూడాలి.