కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. థియేటర్లలో రిలీజైన నెల రోజులకే ఓటీటీలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతుండటంతో థియేటర్లలో సినిమాలు చూసేవాళ్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం థియేటర్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు నిర్మాతల పాలిట శాపంగా మారాయి. పెద్ద సినిమాల నిర్మాతలు థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా విష్ణు ఎన్నిక కావడంతో టాలీవుడ్ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత విష్ణుపై ఉంది.
ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా భావించి సమస్యల పరిష్కారానికి కృషి చేసింది. అయితే సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. అయితే విష్ణు చిరంజీవితో కలిసి సమస్యల పరిష్కారానికి వెళతారా? లేక విష్ణు ఇతర ఇండస్ట్రీ పెద్దలతో వెళ్లి సమస్యను పరిష్కరించుకుంటారా? తెలియాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి టాలీవుడ్ సమస్యలను పరిష్కరిస్తే మాత్రం విష్ణుకు మరింత మంచి పేరు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల నుంచి ఎదురవుతున్న సమస్యల విషయంలో విష్ణు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
త్వరలో ఏపీలోని థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు రానున్నాయని సమాచారం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జరుగుతున్న రచ్చపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం దిశగా అడుగులు వేస్తే మంచిదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.