అక్కినేని నాగచైతన్య ఇటీవల విడుదలైన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాలో కీలకపాత్రలో కనిపించారు. నిజానికి చైతు కష్టపడకుండానే ఆ అవకాశం అతడిని వెతుక్కుంటూ వచ్చింది. రిలీజ్ కు ముందు సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తీరా విడుదలయ్యాక సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది. చైతుకి కూడా ఈ సినిమా కలిసి రాలేదు. ఈ సినిమాని వీలైనంత త్వరగా మర్చిపోవాలని చూస్తున్నారు చైతు. ఇప్పుడు చైతు తండ్రి.. హీరో నాగార్జున బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నారు.
అదే ‘బ్రహ్మాస్త్ర’. రణబీర్ కపూర్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ లో నాగార్జున పాత్రను బాగా ఎలివేట్ చేసి చూపించారు. నాగార్జునతో పాటు అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ప్రమోషన్స్ కూడా జోరుగా చేస్తున్నారు. ఇవన్నీ కలిసొచ్చే విషయాలే. అయితే చైతు మాదిరి నాగార్జునకు ఇది తొలి బాలీవుడ్ సినిమా కాదు.
ఇదివరకు హిందీ సినిమాల్లో కనిపించారు నాగార్జున. కొన్ని స్పెషల్ రోల్స్ లో కూడా కనిపించారు. అందులో ‘బ్రహ్మాస్త్ర’ ఒకటి. అమితాబ్ బచ్చన్ తో నాగార్జున కాంబినేషన్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘ఖుదాగవా’ సినిమా మంచి హిట్ అయింది. ఆ తరువాత ‘మనం’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు అమితాబ్.
ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సెంటిమెంట్ ‘బ్రహ్మాస్త్ర’కి పనికొచ్చేలానే ఉంది. ఈ సినిమాకి సంబంధించి నాగార్జున సక్సెస్ అయినా.. ఫెయిల్ అయినా.. ఆయన కెరీర్ లో వచ్చే మార్పు పెద్దగా ఏం ఉండదు. కాకపోతే.. ఈ మధ్యన చైతు బాలీవుడ్ లో ఫెయిల్ అయ్యారు కాబట్టి నాగార్జున సక్సెస్ అయితే ఫ్యాన్స్ సంతోషిస్తారు.