రజనీకాంత్ (Rajinikanth) ‘జైలర్’ (Jailer) సినిమాలో ఇతర సినిమా పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు కేమియోలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని సినిమాల్లోలా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు అనేలా కాకుండా చాలా పవర్ ఫుల్‌గా రాసుకొచ్చారు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar). ఇప్పుడు ఆయన మరోసారి రజనీకాంత్‌ను ‘జైలర్’గా చూపించబోతున్నారు. త్వరలో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారని సమాచారం. అయితే ఈ సినిమాలోనూ కేమియోలు ఉంటాయని, కొత్త హీరోలు కూడా అతిథులు అవుతారు అని ఇప్పటికే సమాచారం వచ్చింది.
ఈ పాయింట్‌నే ‘జైలర్’లో పవర్‌ఫుల్ కేమియో చేసిన శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర కామెంట్లు చేశారు. శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కొత్త సినిమా ‘45’ విడుదల సంద్భంగా ఇద్దరూ తెలుగు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతుండగానే ‘జైలర్ 2’ సినిమా ప్రస్తావన వచ్చింది. ‘జైలర్’ సినిమా సీక్వెల్‌లో బాలకృష్ణతో (Nandamuri Balakrishna) కలసి నటిస్తున్నారట నిజమేనా అని అడగ్గా.. అవునా నాకు తెలియదు అని కూల్‌గా సమాధానం ఇచ్చారు.
అంతేకాదు ‘జైలర్ 2’ సినిమాలో నా పాత్ర ఉందని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పారని క్లారిట ఇచ్చారు. అలాగే బాలకృష్ణ కూడా సినిమాలో ఉంటే బాగుంటుందని తన మనసులో మాట చెప్పారు. బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో (Gautamiputra Satakarni) తాను నటించానని, అయితే ఇద్దరి కాంబినేషన్‌లో సన్నివేశాలు లేవు అని చెప్పారు. అలాగే తామిద్దరం చాలా క్లోజ్ అని, కుటుంబ సభ్యుల్లా ఉంటామని చెప్పారు శివ రాజ్‌కుమార్.
అయితే మోహన్‌లాల్ ఉంటారా లేదా అనే విషయం మాత్రం చెప్పలేదు. ఇక ‘జైలర్ 2’ విషయానికొస్తే.. తొలి సినిమాలో విలన్ వర్మను ముత్తువేల్ అంతమొందిస్తాడు. అయితే తన వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారని చెబుతాడు వర్మ. ఇప్పుడు రెండో పార్టులో అదే చూపిస్తారు అని అంటున్నారు. మరి నెల్సన్ దిలీప్ కుమార్ ఏం చూపిస్తారో చూడాలి.