ఈ ఏడాది ఆస్కార్ వేడుక ఎంత ఘనంగా జరిగిందో, ఈ క్రమంలో జరిగిన విల్ స్మిత్ – క్రిస్ రాక్ గొడవ అంతే ఘనంగా వైరల్ అయ్యింది. వేదికపై హోస్టింగ్ చేస్తున్న క్రిస్ రాక్ చెంపను విల్ స్మిత్ ఛెళ్లుమనిపించాడు. అదెందుకు ఏంటి అనేది పక్కనపెడితే, అలా సభామర్యాద లేకుండా కొట్టడమేంటి అని అందరూ విస్తుపోయారు. నెటిజన్లు అయితే రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత ఏమైందో ఏమో.. తప్పు చేశాను క్షమించు అంటూ విల్ స్మిత్ సారీ చెప్పాడు.
విల్ స్మిత్ శైలి వివాదానికి దారితీయడంతో సోషల్‌మీడియా వేదికగా స్పందించాడు. క్రిస్ రాక్‌కు బహిరంగ క్షమాపణ చెబుతూ ‘‘హింస ఏ రూపంలో ఉన్నా అది విషపూరితం, విధ్వంసకరం. అకాడమీ అవార్డుల్లో నేను ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యం, క్షమార్హం కాదు. నా గురించి జోకులు వేసినా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ జాడా గురించి, ఆమె ఆరోగ్య పరిస్థితిపై జోకులు వేయడం సరికాదనిపించింది. అందుకే తట్టుకోలేకపోయాను. కోపం భరించలేక చాలా ఉద్వేగంగా స్పందించాను. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయాను అని లేఖలో రాసుకొచ్చాడు విల్ స్మిత్.
క్రిస్ విషయంలో నేను చేసింది తప్పే. అయితే అది ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదు. అయినా నా చర్యలకు చింతిస్తున్నానపు. అకాడమీకి, వీక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఈ షోను చూసిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు. అందమైన జర్నీగా సాగిపోతున్న వేడుకలో నా ప్రవర్తన మచ్చలా మిగిలిపోయినందుకు చింతిస్తున్నా అని స్మిత్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చాడు.
ఇంతకీ ఏమైందంటే… ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి విల్ స్మిత్ సతీమణి జాడా పింకెట్‌తో కలసి వచ్చాడు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు ప్రకటించడానికి ముందు ప్రేక్షకులను అలరించాలని భావించిన క్రిస్… అక్కడే ఉన్న జాడా పింకెట్ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమెను ‘జీ.ఐ.జేన్’ చిత్రంలో ‘డెమి మూర్’ పాత్రతో పోల్చాడు. ఆ సినిమాలో డెమి మూర్ పూర్తిగా గుండుతో ఉంటుంది. ఆ విషయాన్ని నొక్కి చెబుతూ ‘జీ.ఐ.జేన్’ సీక్వెల్‌లో నటిస్తున్నారా ఏంటి అని క్రిస్ జోకేశాడు.
తొలుత ఈ జోక్‌కి విల్ స్మిత్ కూల్‌గానే రియాక్ట్ అయినప్పటికీ… జాడా పింకెట్ నొచ్చుకోవడంతో స్మిత్‌కు కోపం బయటికొచ్చింది. ‘నా భార్య పేరు నీ నోటి నుంచి రావొద్దు’ అంటూ గట్టిగా హెచ్చరించాడు. ఆ తర్వాత స్టేజీ ఎక్కి చెంప చెళ్లుమనిపించాడు. తొలుత ఇది స్క్రిప్ట్‌లో భాగమనుకున్నా.. తర్వాత స్మిత్ నిజంగానే కొట్టినట్లు తెలియడంతో సభికులు, వీక్షకులు ఆశ్చర్యపోయారు. ఈ వ్యవహారంలో స్మిత్ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు స్మిత్‌ను సమర్థిస్తే.. మరికొందరు ఆయన చేసిన పనిని విమర్శించారు. క్రిస్ రాక్‌కు మద్దతుగా పలువురు కమెడియన్లు స్మిత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.