రీమేక్ సినిమా అంటే ఇన్‌స్టంట్ హిట్ అంటారు. ఈ మాట మేం చెప్పింది కాదు. గతంలో చాలా సినిమాలకు ఇదే జరిగింది. అయితే ఒరిజినల్‌ని ఒరిజినల్‌లా తీసేస్తే ఉపయోగం ఏమీ లేదు. అందుకే మన దర్శకులు, రచయితలు తమవైన మార్పులు చేస్తూ ఉంటారు. మన నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అలా చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అలా మార్చిన సినిమాలకు ఇంకా ఎక్కువ పేరు వస్తుంది. ఇప్పుడు ‘వినోదాయ చిత్తం’ విషయంలో ఇదే జరగాల్సిన అవసరం ఉంది.
‘భీమ్లా నాయక్’ లాంటి సినిమాను రీమేక్ చేయడానికి స్టార్ హీరో వెనుకంజ వేయకపోవచ్చు. ఎలాంటి రిస్క్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా అదిరిపోతుంది. కానీ ప్రయోగాత్మక సినిమాలు దగ్గరకు వచ్చేసరికి అంతా మారిపోతుంది. మనది కాని కథను రీమేక్ చేయడం, మనది కాని ఫీలింగ్‌ను మనవాళ్లకు కలిగించాలి. ‘వినోదాయ చిత్తం’ విషయంలో ఇదే సమస్య అని అంటున్నారు సినిమా చూసిన నెటిజన్లు. ఆ సినిమాలో సముద్ర ఖని పోషించిన టైమ్ ఆఫ్ గాడ్ పాత్రను పవన్ కల్యాణ్ చేయడం బాగోదు అనేది కొంతమంది అభిప్రాయం.
‘వినోదాయ చిత్తం’లో సముద్ర ఖని పాత్ర నిడివి తక్కువ. పాత్రకు ప్రాధాన్యమున్నా స్టార్ హీరో చేసేంత పాత్ర కాదు అనేది వారి అభిప్రాయం. ‘గోపాల గోపాల’లో కృష్ణుడి పాత్రలో పవన్ కనిపించారు. దానికి తగ్గట్టే పాత్రను చాలా గొప్పగా తీర్చిదిద్దారు. కృష్ణుడు కావడంతో అతీత శక్తులు ఉన్నట్లు చూపించారు. దీంతో ప్రేక్షకులు సూపర్ హీరోను చూసిన అనుభూతి కలుగుతుంది. కానీ ‘వినోదాయ చిత్తం’లో అలా కాదు. కేవలం మెయిన్ క్యారెక్టర్‌తోపాటు ఉండే ఓ ప్రధాన పాత్ర అంతే.
బొమ్మరిల్లు ఫాదర్ లాంటి ఓ తండ్రి కథ ‘వినోదాయ చిత్తం’ అన్నీ తాను అనుకునట్లే సమయానికి జరుగుతున్నాయని భావించే ఆ తండ్రి సడన్‌గా కారు యాక్సిడెంట్‌లో చనిపోతాడు. స్వర్గానికి నరకాని మధ్య అయ్యో కుటుంబానికి చేయాల్సిన పనులు చాలా మిగిలిపోయాయే అని బాధపడుతుంటాడు. అప్పుడు సమయం… ఓ మనిషి రూపంలో ప్రత్యక్షమై నీవు లేకపోయినా నీ కుటుంబం ఆగిపోదు. కావాలంటే నీకో మూడు నెలలు సమయమిస్తా. కిందకు వెళ్లి చూడు అని చెప్తాడు. దీంతో అతను మళ్లీ కుటుంబం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనేదే కథ.
ఆ మూడు నెలల కాలంలో కాలం పవన్ కల్యాణ్ రూపంలో మరో పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవసరమైన మాటలు, సాయం చేస్తుంటుంది. ఈ పాత్రను పవన్ చేయడమంటే అంత శ్రేయస్కరం కాదనే చెప్పాలి. అభిమానులకు కూడా అంతగా నచ్చదు. మరి ఆ పాయింట్‌ను మాత్రమే తీసుకొని… మొత్తం స్క్రీన్‌ప్లేను వేరేగా రాసుకుంటే సినిమా మన వాళ్లకు బాగా రీచ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ అంటే కష్టమే.