సమస్య రావడం తప్పు కాదు.. దానికి పరిష్కారం కనుక్కోకపోవడం తప్పు అంటారు పెద్దలు. ఈ మాట మన టాలీవుడ్ జనాలు పట్టించుకోరా? లేక పట్టించుకున్నా ఏమీ చేయలేకపోతున్నారా? ఏమో ‘అఖండ 2: తాండవం’ ఆర్థిక పంచాయితీల గురించి వస్తున్న వార్తలు, వినిపిస్తున్న వాదనలు చూశాక ఇదే మాట అంటోంది. ఒకసారి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏమీ చేయలేకపోయినా, రెండోసారో లేక మూడోసారో పరిష్కారం చూసుకోవాలి కదా అనే వాదనలు వినిపిస్తున్నాయి.
‘అఖండ 2: తాండవం’ సినిమా ఆర్థిక లావాదేవీల కారణంగా ఇప్పుడు విడుదల కాలేదు. నిజానికి ఇలాంటి పరిస్థితి బాలకృష్ణకు, అతని అభిమానులకు కొత్త కాదు. గతంలో ‘భైరవ ద్వీపం’, ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమాల సమయంలో ఇలానే జరిగింది. అంతేకాదు గతంలో టాలీవుడ్ ప్రముఖ హీరోలు చాలామంది ఈ పరిస్థితిని ఫేస్ చేశారు. ఎన్నో ఏళ్లు షూటింగ్ జరుపుకున్న చిరంజీవి ‘అంజి’, నాగార్జున ‘ఢమరుకం’, కమల్ హాసన్ ‘విశ్వరూపం’, ఎన్టీఆర్ ‘నరసింహుడు’, గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’, అనుష్క ‘అరుంధతి’, రవితేజ ‘క్రాక్’ .. ఇలా చాలానే ఉన్నాయి. ఇవేకాదు ఇంకొన్ని ఉన్నాయి కూడా.

అయితే, ఇలా జరిగిన ప్రతిసారి సినిమా పరిశ్రమ ఫ్యాన్స్‌కి చెప్పేమాట. టెక్నికల్ ఇష్యూలు, అనుకోని అవాంతరాలు, చెప్పలేని చిన్న సమస్యలు అనే. నిజానికి ఇవన్నీ నిజం కాదు ఆర్థిక పంచాయితీలే అసలు కారణం ఆర్థిక సమస్యలే. వీటిని బయటకు చెప్పకుండా, తేల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు నిర్మాతలు. అభిమానులు ఆవేదన చెందేలా చేస్తున్నారు. ఇదంతా చేసేకంటే ఇలాంటి సమస్యలకు ఓ ఫిక్స్ వెతుక్కుంటే ఇబ్బందులు ఉండేవి కావు.
దేశ సినిమాలో భారీ బడ్జెట్‌లు పెడుతున్న పరిశ్రమగా పేరున్న టాలీవుడ్ ఈ ఆర్థిక సమస్యలకు పరిష్కారం వెతుక్కోలేకపోతోందా? లేక వెతికినా వాటిని ఇతర నిర్మాతలు పాటించడం లేదా? ఈ విషయానికి సమాధానం పరిశ్రమ పెద్దలే చెప్పాలి.
