రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్ గా రూపొందిన ‘భద్ర’ చిత్రం విడుదలయ్యి మే 12(ఈరోజుతో) 16 ఏళ్ళు పూర్తయ్యింది. బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. లవ్, ఫ్యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, కామిడీ ఇలా అన్ని అంశాలు కలిపి రూపొందించిన ‘భద్ర’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఇలాంటి చిత్రం ఒకటి బోయపాటి శ్రీను తీస్తే బాగుణ్ణు అంటూ ప్రేక్షకులు కోరుకుంటున్నారు అంటే.. ఆ చిత్రం ఎంత బాగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఓ మాస్ డైరెక్టర్ .. ఓ మాస్ హీరో కలిస్తే ఎలాంటి అవుట్ పుట్ వస్తుంది అనడానికి ఈ చిత్రం బెస్ట్ ఎగ్జామ్పుల్.
అయితే ఇంత సూపర్ హిట్ చిత్రాన్ని ఇద్దరి స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట. ఆ ఇద్దరు స్టార్ హీరోలతో తన కెరీర్ ను మొదలు పెట్టాలి బోయపాటి ఆరాట పడ్డాడట. ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్. ముందుగా ‘భద్ర’ కథని అల్లు అర్జున్ కు వినిపించాడట. కథ నచ్చింది కానీ ఇప్పుడే ‘గంగోత్రి’ ‘ఆర్య’ సినిమాలు చేశాను.. ఇంత పెద్ద కథను డీల్ చేసే అనుభవం నాకు లేదని రిజెక్ట్ చేసాడట. ఆ తర్వాత ఎన్టీఆర్ ను కలిసి ‘భద్ర’ కథను వినిపించాడట బోయపాటి. అయితే అప్పటికి వరుస ప్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్.. ఈ టైములో కొత్త దర్శకుడితో సినిమా ఎందుకు అని భావించి రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అందులోనూ ‘నా అల్లుడు’ అనే చిత్రంతో వర ముళ్ళపూడి అనే దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి చేతులు కాల్చుకున్నాడు ఎన్టీఆర్. ఈ క్రమంలో బోయపాటి శ్రీనుకి నిర్మాత దిల్ రాజు అవకాశం ఇచ్చాడు.
అప్పటికి రవితేజ కాల్షీట్లు ఉండడంతో కథ వినిపించే ఏర్పాటు చేసాడు. రవితేజ వెంటనే ఓకే చెయ్యడం.. విడుదలయ్యాక సూపర్ హిట్ అవ్వడం జరిగిపోయింది. ఆ తర్వాత ‘తులసి’ ‘సింహా’ ‘దమ్ము’ ‘లెజెండ్’ ‘సరైనోడు’ వంటి చిత్రాలతో తన ఇమేజ్ ను మరింతగా పెంచుకున్నాడు బోయపాటి. అయితే ఆ తర్వాత వచ్చిన ‘జయ జానకి నాయక’ చిత్రం కమర్షియల్ ఫెయిల్యూర్ కాగా ‘వినయ విధేయ రామా’ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు బాలయ్యతో ఓ చిత్రం చేస్తున్నాడు బోయపాటి.. అది హిట్ అయితే అల్లు అర్జున్ తో మళ్ళీ సినిమా చేసే అవకాశం వస్తుంది. మరేమవుతుందో చూడాలి.