వి.వి.వినాయక్ ను అప్పట్లో అందరూ వరుస విజయాల వినాయక్ అనే వారు. ఆయన ఏ సినిమా చేసినా టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు సాధించేవి. రాజమౌళి కంటే ముందే వినాయక్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో కొన్నాళ్ల పాటు వినాయక్ నెంబర్ వన్ డైరెక్టర్ గా చలామణి అయ్యాడు కూడా..! అయితే రాజమౌళికి రైటర్ విజయేంద్ర ప్రసాద్ సపోర్ట్ ఉన్నట్టు.. వినాయక్ కు రైటర్స్ సపోర్ట్ లేదు అనేది ఇండస్ట్రీ టాక్. వినాయక్ దగ్గర సరైన రైటర్ కనుక ఉండి ఉంటే అతను ఇప్పుడు మరో లెవెల్లో ఉండేవాడు అన్నది వారి అభిప్రాయం. రచనా సహకారం లేకపోవడమే తనకి మైనస్ అని వినాయక్ కూడా గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ రీమేక్ సినిమాలతోనైనా మంచి హిట్లే ఇచ్చాడు వినాయక్.
కాకపోతే ఇతను రాజమౌళిని ఫాలో అయిన ప్రతీసారి దెబ్బతిన్నాడు అని కూడా ఇండస్ట్రీలో కొంతమంది చెబుతుంటారు. రాజమౌళి ‘మగధీర’ తీసాడు కదా అని చెప్పి వినాయక్ ‘బద్రీనాథ్’ తీసాడు. నిజానికి వినాయక్ కు ఇష్టం లేకపోయినా ఆ సినిమా చేయించారు అనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది. ‘బద్రీనాథ్’ తో రాజమౌళిని మ్యాచ్ చేయడం పక్కన పెట్టి.. కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాడు వినాయక్. అదే తప్పుని ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు వినాయక్ అంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అతను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ‘ఛత్రపతి’ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమాని ఇప్పటికే చాలా మంది హిందీ ప్రేక్షకులు చూసేసారు. అక్కడ లోకల్ ఛానల్స్ లో కూడా ఈ సినిమాని తెగ వాయించారు.
పైగా ‘ఛత్రపతి’ వచ్చి 15ఏళ్ళు దాటింది. ఈ టైములో బాలీవుడ్లో రీమేక్ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ‘ఛత్రపతి’ సినిమా టైంకి సెల్ ఫోన్ల ఉపయోగం అంతంతమాత్రమే ఉండేది. కాబట్టి.. ఆ సినిమాలో హీరో తన తల్లిని వెతుక్కునే కాన్సెప్ట్ వర్కౌట్ అయ్యింది.ఇప్పటి మొబైల్స్ సంస్కృతి గురించి చెప్పనవసరం లేదు. ఇవన్నీ చూస్తుంటే వినాయక్.. ‘ఛత్రపతి’ రీమేక్ ను అనవసరంగా ఒప్పుకున్నాడా అనే అనుమానం రాకపోదు. ఆ సినిమా బదులు అదే శ్రీనివాస్ ను పెట్టుకుని తెలుగులో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేసినా డబ్బులు, మంచిపేరు వచ్చేవి అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.