అద్భుతమైన కథ.. రామ్ చరణ్, సమంతల నవరస నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కృషి కలిసి రంగస్థలాన్ని అందమైన కళాఖండంగా చేశాయి. మార్చి 30 న తెలుగు భాషలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2014 కోట్ల గ్రాస్ వసూలు చేసి అత్యధిక వసూళ్లు సాధించిన 3వ తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది. నాన్ బాహుబలి రికార్డులన్నిటిని తిరగరాసింది. రామ్ చరణ్ కెరీర్ లో ఉత్తమచిత్రంగా చెప్పుకునే “మగధీర” ని కూడా క్రాస్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయి నేటికీ 97 రోజులు కావస్తోంది. మరో మూడు రోజుల్లో వంద రోజుల మార్క్ ను చేరుకోనుంది. ఈ మధ్య కాలంలో ఎంత మంచి సినిమా అయినా నెలరోజుల పాటు థియేటర్లో ఉండడం కష్టమయ్యేది.
అటువంటిది రంగస్థలం మూవీ హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక థియేటర్లలో వందరోజులు పూర్తిచేసుకోనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మెగా అభిమానులు శతదినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ వేడుకల్లో చిత్ర యూనిట్ పాల్గొంటుందా? లేదా? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తూ బిజీగా ఉండగా.. సుకుమార్ మాత్రం ఈసారి మహేష్ బాబు కి మంచి హిట్ ఇవ్వాలని స్క్రిప్ట్ రాస్తున్నారు. మెగా అభిమానులు మాత్రం వేడుక ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.