ఈ మధ్య కాలంలో వరుసగా పొలిటికల్ సినిమాలు వస్తున్నాయి. ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి.. రాజకీయ నేపథ్యంలో రూపొందిన సినిమాలు ఇలా వరుసగా క్యూలు కడుతున్నాయి. ఇది కొత్త విషయం కాదు.. గతంలో కూడా ఇలా పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమాలు ఎలక్షన్స్ టైంలో రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. వాటి ఫలితాలు ఎలా ఉన్నా కాంట్రోవర్సీలతో కావలసిన మైలేజ్ తెచ్చుకున్నాయి. అదే బాటలో ఇటీవల ‘యాత్ర 2 ‘ వచ్చింది.
ఆ సినిమా బాగానే ఉన్నా.. ‘నిజాలు దాచి, డబ్బా కొట్టడం పై దర్శకుడు ఎక్కువగా దృష్టి పెట్టడం బాలేదు’ అంటూ జనాలు పెదవి విరిచారు. ‘యాత్ర 2 ‘ ఏపీ ప్రభుత్వానికి.. ముఖ్యంగా అధికార పార్టీకి అనుకూలంగా తీసిన సినిమా అని అందరికీ తెలుసు. ఇక ఏపీ.. అధికార పార్టీకి వ్యతిరేకంగా కూడా ఓ సినిమా రూపొందింది. అదే ‘రాజధానీ ఫైల్స్’. తెలుగు ఒన్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి భాను శంకర్ దర్శకుడు. విడుదలైన ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా పాలక పక్షానికి వ్యతిరేకంగా ఉండడంతో ప్రతిపక్షం ఈ చిత్రాన్ని ఇండైరెక్ట్ గా భీభత్సంగా ప్రమోట్ చేసింది.
దాంతో ఈ సినిమాను (Rajdhani Files) నిలిపేయాలని అధికార ప్రభుత్వం ప్రయత్నించడం, దర్శకనిర్మాతలు కోర్టు నుండి స్టే తెచ్చుకొని మరీ రిలీజ్ చేయడంతో ఈ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఇంపాక్ట్ చూపలేకపోయింది. ముందుగా ఇది అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసిన సినిమా అని పరోక్షంగా ప్రమోట్ చేసుకున్నారు. అందువల్ల కాంట్రోవర్సీ క్రియేట్ అయిన మాట వాస్తవం. కానీ విడుదలకు 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి ‘ఇది ఏ రాజకీయ పార్టీపై వ్యతిరేకంగా తీసిన సినిమా కాదు,
కేవలం ‘అమరావతి’ కోసం భూములు పోగొట్టుకున్న రైతుల బాధలను చూపించడానికి తీసిన సినిమా’ అంటూ సింపతీ క్రియేట్ చేసే పనులు పెట్టుకున్నారు మేకర్స్. కానీ దాని వల్ల సినిమా పై అప్పటి వరకు ఉన్న బజ్ అంతా స్మాష్ అయిపోయింది. సినిమాలో అధికార పార్టీకి వ్యతిరేకంగా సీన్స్ ఉన్నా..అవి జనాలను థియేటర్ కి తీసుకురాలేకపోయాయి. కేవలం చిత్ర బృందం పెట్టిన అనవసర ప్రెస్ మీట్ వల్ల ఈ డ్యామేజ్ జరిగింది అనే కామెంట్స్ ఇప్పుడు ట్రేడ్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి.