అందరికీ తెలిసిపోయిన విషయాన్ని దాస్తే ఎలా ఉంటుంది? చాలా బాగోదు కదా. ఇప్పుడు #ssrmb అలియాస్ #ssmb29 సినిమా టీమ్ చేస్తున్న పనులు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఆ సినిమాలో ఎవరు నటిస్తున్నారు, ఎక్కడ షూటింగ్ చేస్తున్నారు లాంటి విషయాలు చాలా వరకు తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఈ మేరకు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. అయినా సినిమా టీమ్ నుండి ఇంకా సినిమా గురించి అధికారిక ప్రకటనలు ఏవీ రావడం లేదు. రాకపోగా ‘ఓ సినిమా’ అంటూ గోప్యత పాటిస్తున్నారు కూడా.
మహేష్ బాబు (Mahesh Babu) – రాజమౌళి (Rajamouli) – ప్రియాంక చోప్రా (Priyanka Chopra) – పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కాంబినేషన్‌లో ‘ఓ సినిమా’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఒడిశాలో, హైదరాబాద్‌లో ఇటీవల సినిమా షూటింగ్ నిర్వహించారు. త్వరలో కెన్యాలో షూటింగ్ ఉంటుంది అని కూడా అంటున్నారు. అయితే రాజమౌళి రెగ్యులర్ తరహాలో కాకుండా ఈ సినిమా గురించి ఎలాంటి సమాచారం అయితే ఇవ్వడం లేదు. ఆయన ఓ షెడ్యూల్ అవ్వగానే ప్రెస్ మీట్ పెట్టి సినిమా కాన్సెప్ట్‌ను, స్టోరీ లైన్‌నో వివరించేవారు. ఈసారి అది జరగలేదు. దీంతో సినిమా గురించి అధికారిక సమాచారం లేనట్లే.
అయితే, ఆ ‘ఓ సినిమా’ గురించి టీమ్ మాత్రం వివిధ సందర్భాల్లో అన్యాపదేశంగా, ఇన్‌డైరెక్ట్‌గా చెబుతూ వస్తోంది. తాజాగా కథానాయిక ప్రియాంక చోప్రా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ తాను ప్రస్తుతం ‘ఓ ఇండియన్ సినిమా’లో నటిస్తున్నానని చెప్పింది. ఆ ప్రాజెక్ట్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు కూడా చెప్పింది. ఆ క్లిప్ అయితే ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఇంకా ఆ ‘ఓ సినిమా’ అనే ట్యాగ్‌లైన్ ఎందుకు ఆ సినిమా ఏంటో చెప్పొచ్చు కదా అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.
అయితే, ఆమె తప్పేమీ లేదని, సినిమా గురించి ఇంకా ఎక్కడా మాట్లాడొద్దని దర్శకుడు రాజమౌళి చెప్పి ఉంటారు అని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఇలాంటివి గతంలోనూ చేశారు. అయితే ఇంకెన్నాళ్లు దాస్తారు, కనీసం అనౌన్స్‌మెంట్‌లాంటిది ఇస్తే ‘ఓ సినిమా’ బదులు.. ‘ఫలానా సినిమా’ అని అనొచ్చు కదా.