దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్‌లో నితిన్ (Nithiin) నటించడం అనేది కొత్తేమీ కాదు. నితిన్‌కు మంచి ఇమేజ్ ఇచ్చిన సినిమాలు, ఇమేజ్ మార్చిన సినిమాలు చాలా వరకు ఆ బ్యానర్‌లోనే వచ్చాయి. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అవుతున్న ‘తమ్ముడు’ (Thammudu) సినిమా కూడా ఆ బ్యానర్‌లోనే తెరకెక్కింది. నితిన్ – దిల్ రాజు మధ్య అంతటి అనుబంధం ఉంది. అయితే ‘తమ్ముడు’ సినిమా ప్రచారంలో నితిన్ అంత యాక్టివ్‌గా లేడు. సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్లలో పెద్దగా కనిపించలేదు. సినిమా గురించి సోషల్ మీడియాలో ఆ స్థాయి హడావుడి లేదు. ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారంతే.
ఇంటర్వ్యూ అనే కంటే దిల్ రాజు (Dil Raju), నితిన్ (Nithiin) కలసి మాట్లాడుకున్నట్లు వాళ్లకు వాళ్లే ఓ వీడియో రికార్డు చేసి రిలీజ్ చేశారు. అంతే కానీ ఎక్కడా సినిమా గురించి నితిన్ బయటకు రావడం లేదు. రిలీజ్‌కు ఇంకా ఎక్కువ సమయం కూడా లేదు. మరో రోజులో సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుంది. అయినా నితిన్ నుండి ఇంకా గతంలో చేసినంత హడావుడి కనిపించలేదు. సినిమా రిలీజ్ అయ్యాక ఏమన్నా ప్రచారం చేస్తాడేమో చూడాలి. ఒకవేళ అది జరిగినా ఎందుకు ముందు లేదు అనే ప్రశ్న వస్తుంది.
నితిన్‌ని ఇన్నేళ్లుగా చూస్తున్నవాళ్లు కూడా ‘ఇదేంటి నితిన్ ఇలా డల్‌గా ఉన్నాడు’ అని అంటున్నారు. ఎందుకంటే వరుసగా పది సినిమాలు ఆశించిన ఫలితం అందుకోకపోయినా నితిన్ అయితే ప్రతి సినిమాకు ప్రచారం చేశాడు. అందుకే గత సినిమాల ఫలితాలు ఇక్కడ పాయింటే కాదు. అన్నట్లు దిల్ రాజు ఇంటర్వ్యూలో కూడా కొన్ని ఇన్‌డైరెక్ట్ సెటైర్లు నితిన్ మీద పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏమైంది అనే ప్రశ్న వినిపిస్తోంది. మరోవైపు ‘యల్లమ్మ’ విషయంలో ఈ ప్రభావం పడుతుందా అనే డౌట్ కూడా వస్తోంది.
ఎందుకంటే ఈ సినిమా విషయంలో యాక్టివ్‌గా లేకపోతే ఇంకో సినిమా చేయడానికి ఏ నిర్మాతా ముందుకు రారు. మరి నితిన్ విషయంలో జరుగుతుంది? ‘యల్లమ్మ’ హీరో మారుతాడా? లేక నితినే ఉంటాడా అనేది చూడాలి. ఇక్కడ ఇన్ని డౌట్స్ రావడానికి మరో కారణం ఏ ఇంటర్వ్యూలోనూ నిర్మాతలు ‘యల్లమ్మ’ టాపిక్ రానివ్వడం లేదు. ప్రస్తావన కూడా రావడం లేదు.