ఇది సోషల్ మీడియా యుగం. ఎవరు ఎక్కడ ఏమి చేసినా అందులో విషయం ఉంటే ఒక్కసారిగా వైరల్ గా మారిపోతుంది. ఇక సినిమా హీరోల మూవీ అప్డేట్స్ ఏవైనా క్షణాలలో అందరికీ చేరిపోతాయి. ఐతే సోషల్ మీడియా కారణంగా ఒకొకసారి డూప్లికేట్ కూడా ఒరిజినల్ గా ప్రచారం అవుతుంది. కొన్ని సార్లు ఫ్యాన్ మేడ్ టైటిల్ పోస్టర్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ విపరీతంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అసలు ఒరిజినల్ అనేంతలా అవి ఫ్యాన్స్ ని భ్రమ పరుస్తున్నాయి.
దర్శక నిర్మాతలు అది ఒరిజినల్ కాదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అందుబాటులో ఉన్న సాంకేతికత, సమాచారం ఆధారంగా సినిమా నేపధ్యానికి దగ్గరగా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్స్ ఫ్యాన్స్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. గతంలో ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ లుక్ అంటూ ఫ్యాన్ డిజైన్ చేసిన పోస్టర్ విపరీతంగా వైరల్ అయ్యింది. అలాగే గోవింద ఆచార్య టైటిల్ తో చిరు-కొరటాల మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
ఇక తాజాగా సుకుమార్ చిత్రంలో బన్నీ లుక్ ఇదేనంటూ అధికారిక పోస్టర్ ని తలపించేలా ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. బన్నీ ప్రజెంట్ లుక్ రిఫరెన్స్ తీసుకుని ఒక పోస్టర్ డిజైన్ చేసి ఫస్ట్ లుక్ పేరుతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లోగో, అఫీషియల్ టీమ్ మెంబర్స్ పేర్లన్నీ వేసి అచ్చు అధికారిక పోస్టర్ మాదిరి విడుదల చేశారు. ఆ పోస్టర్ లో బన్నీ చాల రఫ్ గా ఆ సినిమా నేపధ్యానికి తగ్గట్టుగా ఉన్నాడు. బన్నీ ఈ చిత్రంలో లారీ డ్రైవర్ రోల్ చేస్తుండగా పోలిక చాల దగ్గరగా ఉంది. ఇలా ఫాన్ మేడ్ పోస్టర్స్ మేకర్స్ కి ఝలక్ ఇస్తున్నాయి.