కొన్ని సినిమాలు ఎందుకు బాగా ఆడతాయో, ఇంకొన్ని సినిమాలు ఎందుకు బాగా ఆడవో ఎవరూ చెప్పలేరు. సినిమా ఇండస్ట్రీలో ఈ మాట చాలా రోజుల నుండి వింటూనే ఉంటాం. అయితే ఈ మాట కేవలం థియేటర్స్‌లో వచ్చే సినిమలకే కాదు… టీవీల్లో, ఓటీటీల్లో వచ్చే సినిమాల విషయంలోనూ ప్రస్తావించుకోవచ్చు. ఏంటీ ఈ విషయం ఏమన్నా డౌట్ ఉందా? అయితే ‘ఆదికేశవ’ సినిమా సాధించిన టీఆర్‌పీ గురించి తెలుసుకోవాల్సిందే. థియేటర్లలో హిట్టయిన సినిమాలు టీవీల్లో ఫ్లాప్ అవ్వడం మనం చూశాం.
అలాగే థియేటర్లలో డిజాస్టర్ అయిన సినిమాలు టీవీల్లోకి వచ్చి టీఆర్పీల్లో సక్సెస్ అవ్వడం కూడా చూశాం. అయితే టీవీల్లో సినిమాలకు బాగా క్రేజ్ ఉన్న రోజులు. ఇప్పుడు అంటే టీవీల్లో సినిమాలకు పెద్దగా బజ్ లేని రోజుల్లో ఓ థియేటర్ డిజాస్టర్ సినిమా టీవీల్లో అదిరిపోయే రెస్పాన్స్ సంపాదించుకుంది. అదే ‘ఆదికేశవ’. వైష్ణవ్‌తేజ్ – శ్రీలీల జంటగా నటించిన చిత్రమిది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో సరైన ఫలితం అందుకోలేదు.
కానీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా స్టార్ మా ఛానెల్‌లో ఇటీవల ఈ సినిమాను ప్రసారం చేశారు. ఈ క్రమంలో అర్బన్ టీఆర్పీ లెక్కలు తీస్తే… ఏకంగా 10.29 వచ్చిందట. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ స్థాయి నెంబర్లు నమోదు కాలేదు. తొలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్, శ్రీలీల ఆ తర్వాత సరైన విజయం అందుకోలేకపోయారు.
వరుసగా సినిమాలు చేసిన విజయాలు అయితే రాలేదు. కానీ ఇప్పుడు (Aadikeshava) ‘ఆదికేశవ’తో టీవీల్లో మంచి విజయమే అందుకున్నారు. ఇది కచ్చితంగా ఇద్దరికీ బూస్టింగ్ ఇచ్చే అంశమే అని చెప్పాలి. అయితే ఇక్కడ ఎంత విజయం అందుకున్నా… థియేటర్లలో విజయం సాధిస్తేనే లెక్క అని చెబుతుంటారు. కాబట్టి వైష్ణవ్ తేజ్, శ్రీలీల ఈ విషయం మరోసారి ఆలోచించాలి.