ఒకప్పుడు లవ్ అండ్ కామెడీ సినిమాలతో మెప్పించిన వేణు.. తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యాడు. అతని ఖాతాలో ‘స్వయంవరం’ ‘చిరునవ్వుతో’ ‘కళ్యాణ రాముడు’ ‘పెళ్ళాం ఊరెళితే’ ‘ఖుషి ఖుషీగా’ వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. 2013లో వచ్చిన ‘రామాచారి’ చిత్రం తర్వాత వేణు తొట్టెంపూడి మరో సినిమాలో హీరోగా నటించలేదు. 9 ఏళ్ళ గ్యాప్ తర్వాత గత ఏడాది అతను ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.
సీఐ మురళి అనే పాత్ర అది. అటు పాజిటివ్ రోల్ అని చెప్పలేము.. నెగిటివ్ రోల్ అని చెప్పలేము. అలా ఉంటుంది ఆ పాత్ర. డిఫెరెంట్ గా ఉంది కాబట్టే.. వేణు కూడా అలాంటి రోల్ ని ఓకే చేసి ఉండొచ్చు. కానీ అతను ఆ సినిమాతో మంచి రీ ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే తాజాగా ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు (Venu) వేణు.
‘అతిధి’ అనే టైటిల్ తో రూపొందిన ఈ వెబ్ సిరీస్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దీని ప్రమోషన్లో భాగంగా వేణు..తన రీ ఎంట్రీ సినిమా అయిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిజల్ట్ పై స్పందించాడు. ‘అది నా రీ ఎంట్రీ సినిమా అని నేను అనుకోవడం లేదు. నేను 10 ఏళ్ళ ముందు నటుడినే.. తర్వాత కూడా నటుడినే. ఆ సినిమా మా ఫ్రెండ్స్ కోసం ఒప్పుకుని చేసింది. నేను ప్రత్యేకంగా చేయాలి అని చేసింది కాదు’ అంటూ అతను చెప్పుకొచ్చాడు.