30 ఏళ్ల పాటు ఓ హీరోయిన్ తన కెరీర్‌ను కొనసాగించారు అంటే.. ఆమె ఎంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి రోజుల్లో ఇలాంటి హీరోయిన్లను చూడలేం కానీ.. ఒకప్పుడు చాలామంది ఉండేవారు. అందులో జమున ఒకరు. శుక్రవారం తుది శ్వాస విడిచిన జమున గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ క్రమంలో ఆమె తొలి నాటి రోజుల్ని ఓసారి గుర్తు చేసుకుంటే.. ఆసక్తికరమైన విషయాలెన్నో కనిపిస్తాయి. జమున హంపిలో పుట్టారు. విజయనగర సామ్రాజ్యం రాజధాని, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి ఆ హంపిలో నేను పుట్టాను అంటూ జమున ఘనంగా చెప్పుకునేవారు.
అంతేకాదు ఆ రోజుల్లో జమునను ‘హంపీ సుందరి’ అనేవాళ్లట. ఇప్పటివాళ్లకు జమున గురించి తెలియదు కానీ.. ఆమె అందం అప్పుడు హంపి శిల్పాలను మించి ఉండేది అని అనేవారు. ఆ విషయం పక్కనపెడితే.. జమున పుట్టింది కర్ణాటకలోనైనా చదివిందంతా కూడా దుగిరాన్ అనే గ్రామంలో. మెట్రిక్ వరకూ చదువుకున్నారు. చిన్నతనం నుండి ఆమెకు కళలు అంటే ఇష్టం. వీలైనప్పుడల్లా డ్యాన్స్ చేసేవాళ్ల. ఆమె చదువుకున్న స్కూలుకు ఎవరైనా పెద్దవాళ్లు వస్తే జమున చేత పాటలు పాడించేవాళ్లట ఆమె మాస్టర్లు.
అలా తొమ్మిదేళ్ల వయసు వచ్చేసరికి నాటకాల్లోకి వచ్చారు. ఆమె నటించిన ‘మా భూమి’ అనే నాటకానికి బాగా పేరొచ్చిందట. ఆ రోజుల్లో విందు నాటికలో యశోదగా నటించి, దానికి దర్శకత్వం కూడా వహించారట జమున. అంతేకాదు ఆ నాటకం కోసం మ్యూజిక్ కూడా ఆమె కంపోజ్ చేశారట. అలా 12 ఏళ్ల వయసు వచ్చేసరికి నాటకాల్లో ఆల్‌రౌండర్‌గా అదరగొట్టేశారు జమున. అదే సమయంలో నాటక రంగానికే చెందిన డా.రాజారావు అనే ఆయన ‘పుట్టిల్లు’ అనే సినిమా తీస్తున్నారు.
అందులో కొత్త హీరోయిన్‌ని తీసుకోవాలని వెతికారట. అప్పుడే జమునను ఓ నాటకంలో చూశారట. దీంతో ‘పుట్టిల్లు’ సినిమాలో వేషానికి జమున బాగుంటారన్న ఉద్దేశంతో వాళ్లింటికి ఫొటోగ్రాఫర్‌ని పంపించి మరీ ఫొటోలు తీయించారట. ఆ ఫొటోలు చూసిన రాజారావు ఈ అమ్మాయికి నర్గీస్ పోలికలు ఉన్నాయి అని అన్నారట. అలా ‘పుట్టిల్లు’ సినిమాలోలో హీరోయిన్ పాత్రకి జమున ఎంపికయ్యారు.