Priyanka Arul Mohan: ప్రియాంక జోరుకు కారణాలేంటో మరి

రెండేళ్ల క్రితం ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమాలో టాలీవుడ్‌లో ప్రవేశించింది ప్రియాంక అరుళ్‌ మోహన్‌. ఆ సినిమాలో పాత్రకు పెద్దగా ఎలివేషన్‌ రాలేదనే చెప్పాలి. పేరుకే హీరోయిన్‌ అని కానీ… ఆరు కీలక పాత్రల్లో ఒకటిగానే కనిపిస్తుంది. దీంతో ఈ అమ్మడికి అనుకున్నంత గుర్తింపు రాలేదు. కానీ అవకాశాలు మాత్రం వస్తున్నాయి. అలా ‘శ్రీకారం’లో నటించిన ప్రియాంక… ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తోంది. మరోవైపు తెలుగులో పెద్ద సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిందట.

‘సోగ్గాడే చిన్ని నాయన’ కాంబినేషన్‌లో ‘బంగార్రాజు’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ‘సోగ్గాడే..’కి ప్రీక్వెలా, సీక్వెలా అనేది తెలియదు కానీ… ఆ సినిమాకు ఈ సినిమాకూ సంబంధం అయితే ఉంది. ఇదంతా పక్కన పెడితే… ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తోందనేది తాజా వార్త. నాగచైతన్యతో ప్రియాంక రొమాన్స్‌ చేయబోతోందట. అయితే ఇక్కడే ఓ పాయింట్‌ గుర్తించాలి. ‘బంగార్రాజు’ సినిమాలో నాగచైతన్య సరసన సమంత నటిస్తుందని తొలుత వార్తలొచ్చాయి. అంతా ఓకే అయిపోయింది… సినిమా సెట్స్‌ మీదకు వెళ్లడమే ఆలస్యం అనుకున్నారంతా.

అయితే ఈలోగా కరోనా సెకండ్‌ వేవ్‌ రావడంతో మొత్తం డిస్ట్రబ్‌ అయ్యింది. అంతే కాదు ఈ సినిమాను సమంత పక్కకు తప్పుకుందట. ‘శాకుంతలం’ సినిమా కోసం సమంత ఇచ్చిన తేదీలు రీ అడ్జెస్ట్‌ చేయాల్సి వస్తుండటంతో ‘బంగార్రాజు’ నుండి తప్పుకుందంటున్నారు. ఎలాగైతే ఏముంది… ప్రియాంకకు మాత్రం సరైన విజయం దక్కకపోయినా పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ముందు చెప్పుకున్నట్లు తమిళంలో మూడు సినిమాలు చేస్తోంది ప్రియాంక. శివకార్తికేయన్‌తో రెండు సినిమాలు చేస్తోంది. దీంతోపాటు పాండిరాజ్‌, సూర్య సినిమాలోనూ ప్రియాంక కథానాయికగా చేస్తోంది మరి. ఇంకా తెలుగులో మరికొన్ని అవకాశాలు ఆమె కోసం సిద్ధంగా ఉన్నాయంటున్నారు. లక్కీ లేడీ ప్రియాంక.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus