‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకి సంబంధించి ఇటీవల టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టీజర్ పై ఎన్నో విమర్శలు ఎదురవుతున్నాయి. టీజర్ లో ఎన్టీఆర్ పాత్ర కొమరం భీమ్ ముస్లిం గెటప్ లో కనిపిస్తారు. ఇలా చూపించడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని కొమరం భీమ్ విగ్రహానికి ఆదివాసీల యువసేన క్షీరాభిషేకం చేశారు. ‘ఆర్ఆర్‌ఆర్’ టీజర్‌లో కొమరం భీమ్ పాత్రకు ముస్లిం టోపి పెట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జల్-జంగల్-జమీన్ నినాదంతో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొమరం భీమ్ అని.. ఆయన చరిత్రను పూర్తిగా అర్థం చేసుకుని సినిమా తీయాలంటూ రాజమౌళికి సూచించారు. తమ నాయకుడిని కించపరిచేలా తీసిన సన్నివేశాలను తొలగించాలని లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆదివాసీలు చిత్రబృందాన్ని హెచ్చరించారు. ఒకవేళ ఇది ఫిక్షన్ కథ అయితే.. కొమరం భీమ్ పేరుని ఉపయోగించకూడదని డిమాండ్ చేస్తున్నారు. సినిమా నుండి మాత్రమే కాకుండా.. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ నుండి కూడా సదరు సన్నివేశాలను తొలగించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇలాంటి వివాదాలు దర్శకుడు రాజమౌళికి కొత్తేమీ కాదు. ‘బాహుబలి’ సినిమా తీసిన సమయంలో సినిమా టైటిల్ ని మార్చాలంటూ కర్ణాటకకు చెందిన ఓ తెగ డిమాండ్ చేసింది. వాటన్నింటినీ దాటుకొని సక్సెస్ అందుకున్నాడు రాజమౌళి. మరిప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ వివాదం నుండి ఎలా బయటపడతారో చూడాలి..!