ఈ మధ్య కాలంలో సీనియర్ స్టార్ హీరోలకి హీరోయిన్లని సెట్ చేయడం దర్శకనిర్మాతలకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. పాత హీరోయిన్లని పెడితే కుర్రకారు యాక్సెప్ట్ చేయరు. కొత్త హీరోయిన్లని పెడితే ఏజ్ గ్యాప్ కనిపించేస్తుంది. అయినప్పటికీ కిందా మీదా పడి హీరోయిన్లని సెట్ చేస్తున్నారు అనుకోండి. అయితే ఇప్పుడు వీరి చెల్లెలి పాత్రలకి కూడా హీరోయిన్లని సెట్ చేయాల్సి వస్తోంది. ఇది వారికి మొదటి టాస్క్ కంటే పెద్ద టాస్క్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రంలో కీర్తి సురేష్ ను చెల్లెలి పాత్రకి ఎంపిక చేసుకున్నారు. నిజానికి ముందుగా సాయి పల్లవి వంటి హీరోయిన్లను కూడా సంప్రదించినట్టు స్వయంగా చిరునే చెప్పుకొచ్చారు. అయితే ‘భోళా శంకర్’ కంటే ముందే ‘గాడ్ ఫాదర్’ మొదలైంది. మలయాళం ‘లూసీఫర్’ కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో చెల్లెలి పాత్ర కోసం చాలా మంది హీరోయిన్లని సంప్రదించారు.కుష్బూ, వరలక్ష్మీ శరత్ కుమార్, నయనతార వంటి స్టార్ల పేర్లు వినిపించాయి.
కానీ చివరికి రమ్యకృష్ణని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. 1987 లో చిరంజీవి హీరోగా వచ్చిన ‘చక్రవర్తి’ సినిమాలో చిరుకి చెల్లెలి పాత్ర పోషించింది రమ్యకృష్ణ. మళ్ళీ 24 ఏళ్ళ తర్వాత చెల్లెలిగా కనిపించబోతుంది. మధ్యలో చిరుకి జోడీగా ఈమె చాలా సినిమాల్లో నటించింది. ‘అల్లుడా మజాకా’ ‘ముగ్గురు మొనగాళ్ళు’ ‘ఇద్దరు మిత్రులు’ వంటి సినిమాల్లో చిరు సరసన హీరోయిన్ గా చేసింది రమ్యకృష్ణ.