ఒకప్పుడంటే ఓ మోస్తరు హీరోలకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్, మార్కెట్ ఉండేది.. మినిమం గ్యారంటీ అనిపించుకుని కెరీర్ నెట్టుకొచ్చిన హీరోలు చాలా మందే ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో.. వాళ్లల్లో అక్కినేని థర్డ్ జనరేషన్ కథానాయకుడిగా ‘ప్రేమకథ’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున మేనల్లుడు సుమంత్.. ‘యువకుడు’, ‘సత్యం’, ‘గౌరి’, ‘గోదావరి’ ‘మధుమాసం’ వంటి పలు చిత్రాలతో ప్రేక్షకాభిమానులను అలరించాడు. తాత ఏఎన్నార్‌తో ‘పెళ్లిసంబంధం’, మావయ్య నాగార్జునతో ‘స్నేహమంటే ఇదేరా’ సినిమాలు చేశాడు.
కొంత గ్యాప్ తర్వాత ‘మళ్లీ రావా’ అనే ఫీల్ గుడ్ ఫిలింతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. ‘సుబ్రహ్మణ్యపురం’, ‘ఇదం జగత్’, ‘కపటదారి’, ‘మళ్లీ మొదలైంది’ లాంటి మూవీస్‌లో నటించాడు. బాలయ్యతో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాల్లో తాత పాత్రలో ఇమిడిపోయాడు. ఇటీవల ‘సీతారామం’ లో ఇంపార్టెంట్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హీరోగా ‘అనగనగా ఓ రౌడీ’, ‘వారాహి’ సినిమాలు చేస్తున్నాడు. కథ, క్యారెక్టర్ నచ్చితే ఇతర హీరోల పక్కన కీలకపాత్రల్లో నటించడానికెప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు సుమంత్.
ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అది కూడా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ కావడంతో ఈ వార్త వైరల్ అవుతోంది. ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ తో స్టార్ స్టేటస్‌తో పాటు మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు విజయ్.. వరుస ఫ్లాపులతో కాస్త డీలా పడ్డాడు. ఇటీవల ‘లైగర్’ పాన్ ఇండియా స్థాయిలో డిజాస్టర్‌గా మిగలడమే కాక విజయ్‌ని విమర్శల పాలు చేసింది కూడా.
ఎప్పుడో అనౌన్స్ చేసిన సుకుమార్ సినిమా పక్కన పెడితే.. శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ‘ఖుషి’ మీదే ఫోకస్ పెట్టాడు. తర్వాత ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ పిక్చర్ కమిట్ అయ్యాడని.. అందులో కథను మలుపుతిప్పే ఓ కీ క్యారెక్టర్ కోసం సుమంత్ అయితే బాగుంటుందని.. కలిసి స్టోరీ చెప్పగా ఎగ్జైట్ అయిన సుమంత్ నటించడానికి ఒప్పుకున్నాడని అంటున్నారు.