నాగార్జున, నాగచైతన్య హీరోలుగా రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి’, ‘జీ స్టూడియోస్’ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగార్జున కొన్ని ఆసక్తికరమైన విశేషాలను చెప్పుకొచ్చారు.
ప్ర.పెద్ద బంగార్రాజుగా ఓ రేంజ్లో అలరించారు.. ఈసారి చిన్న బంగార్రాజుతో వస్తున్నారు. ఈసారి ఎలా అలరిస్తాం అనుకుంటున్నారు?
జ.అవును.. ఈసారి చిన్న బంగార్రాజుతో పండుగకి వస్తున్నాం. చై ఇందులో పార్ట్ అవ్వడంతో మంచి ఎనర్జీ కూడా తోడయ్యింది. కచ్చితంగా ఇది పండుగలాంటి సినిమా.
ప్ర.’సోగ్గాడే’ తో రిజల్ట్ ‘బంగార్రాజు’ కి ఎంత వరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు?
జ. సోగ్గాడే మేము అనుకున్నదానికంటే కూడా బాగా ఆడింది. అందరూ ఆ మూవీని చూసి బాగా ఎంజాయ్ చేసారు. కాకపోతే ఆ చిత్రం సక్సెస్ ‘బంగార్రాజు’ కి ప్లస్ అవుతుంది. కాకపోతే దానికి సీక్వెల్ అవ్వడం… ఇందులో నాగ చైతన్య కూడా భాగం కావడంతో మరింత బాధ్యతగా వ్యవహరించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. సంక్రాంతికి పండుగలాంటి సినిమా ఇస్తున్నామని ముందు నుండీ ప్రేక్షకులకి మాటిచ్చాము కాబట్టి ఇది మాకు చాలా పెద్ద బాధ్యత.
ప్ర.మీరు సోగ్గాడే గెటప్ లో ఉన్నప్పుడు నాన్నగారు(అక్కినేని నాగేశ్వరరావు) ఏమైనా గుర్తొస్తారా?
జ.ఎస్… పంచెకట్టు కట్టినప్పుడల్లా నాన్న గారు గుర్తొస్తుంటారు.
ప్ర.’మనం’ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో చైతన్యతో ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు? అఖిల్ కూడా ఉంటే మరో మనం అయ్యేదనే థాట్ రాలేదా?
జ. ‘మనం’ లాంటి మూవీ మనం ప్లాన్ చేసుకుంటే అవ్వదు. అది మేము కాకుండా వేరే వాళ్ళు చేస్తే ఆ రిజల్ట్ రాదు. నాన్న గారు లేకపోయినా, నేను లేకపోయినా, చై లేకపోయినా దానిని జనాలు ఓన్ చేసుకోవడం కష్టం.మేము చేసాం కాబట్టే ఆ మూవీకి ఆ ఫీల్ వచ్చింది. హిందీలో ‘మనం’ ని రీమేక్ చెయ్యాలని చాలా మంది అనుకున్నారు. కానీ అది సెట్ అవ్వలేదు.వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. విక్రమ్ కూడా ట్రై చేశాడు కానీ వర్కవుట్ కాలేదు. ‘బంగార్రాజు’ విషయంలో కూడా అంతే.అది ప్లాన్ చేస్తే అవ్వదు. సీక్వెల్ ఉంటుందని సోగ్గాడు చేయలేదు. కానీ ‘బంగార్రాజు’ చేయగలిగాము.ముందు ‘బంగార్రాజు’ని ఆడనివ్వండి. ఓ వారం తరువాత చూద్దాం.
ప్ర.అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఈ మూవీకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు?అతనితో మీ ట్రావెలింగ్ ఎలా ఉంది?
జ. ‘ఇష్క్’ మ్యూజిక్ నచ్చి ‘మనం’ కి కూడా అనూప్ ని తీసుకున్నాం.ఆ సినిమాకి అనూప్ మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది.అనూప్ మాకు చాలా స్పెషల్. టైం ఇస్తాడు. టైం తీసుకుంటాడు. అన్నపూర్ణలో ఫ్యామిలీ మెంబెర్ లా ఉంటాడు.నేను ఇది బాలేదంటే ఏమీ ఫీల్ అవ్వడు. కళ్యాణ్‌కి కూడా అనూప్ ఉంటే దిగులుండదు. ఈ మూవీకి అనూప్ ని తీసుకుందాం అని కళ్యాణే ముందు చెప్పాడు.
ప్ర.మీకు గోదావరి యాస అనేది ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ చైతన్య గారికి అది అలవాటు లేదు కదా? ఆయన ఏమైనా ఇబ్బంది పడ్డారా?
జ. చైతన్యని అందుకే నా బాడీ లాంగ్వేజ్ కోసం ‘సోగ్గాడే’ ని బాగా చూడమని సలహా ఇచ్చాను. పెద్ద బంగార్రాజు ఆత్మ చైతన్య లోపలకి ఎంట్రీ ఇచ్చాక అతని బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్ మారాలి. అందుకోసం చైకి డైలాగ్స్ అన్నీ రికార్డ్ చేసి ఇచ్చేవాడిని. అలా చై వాటిని ఫాలో అయ్యాడు. అయితే నాకంటే కూడా కళ్యాణ్‌కు ఆ యాస మీద పట్టు ఉంది కాబట్టి… అంతా తనే చూసుకున్నాడు.
ప్ర.మరోసారి రమ్యకృష్ణ గారితో వర్క్ చేసారు? ఆమె గురించి చెప్పండి..!
జ.రమ్యది నాది గోల్డెన్ కాంబో. మాకు ఒకరి గురించి ఇంకొకరికి బాగా తెలుసు. రమ్యతో వర్క్ చేయడం నాకు ఎంతో సరదాగా ఉంటుంది. సెట్‌లో అంతా నవ్వుకుంటూనే ఉంటాం.
ప్ర. షూటింగ్ అనుకున్న టైంకే ఫినిష్ చేసారా?
జ.ఆగస్ట్ 25న షూటింగ్ స్టార్ట్ చేసాం. ఆ రోజే టీం అందరికీ చెప్పాను. ‘సంక్రాంతి పండక్కే ఈ మూవీని విడుదల చేయాలి అని. కుదరకపోతే వచ్చే సంక్రాంతి వరకు ఇవ్వలేము. మీకు ఇబ్బంది అయితే సినిమాని ఇప్పుడు ఆపేద్దాం అని చెప్పాను’. ఆ మాటల్ని దృష్టిలో పెట్టుకుని టీం అంతా కష్టపడి ఫినిష్ చేశారు.
ప్ర.టికెట్ రేట్ల ఇష్యు గురించి మీరు స్పందించిన తీరు పై రకరకాల కామెంట్లు వినిపించాయి? మీకు ఎలా అనిపించింది?
జ. ఏప్రిల్ 7, 8 తేదీల్లో రేట్ల తగ్గింపు జీవో వచ్చింది. కాబట్టి మన సినిమా హిట్ అయితే ఇంత వస్తుంది. అని లెక్కలు వేసుకున్నాం. ఈ రేట్లకు తగ్గట్టు ‘బంగార్రాజు’ బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నాం. అనుకున్న టైంకి అనుకున్న బడ్జెట్ లో మా సినిమాని ఫినిష్ చేసాం కాబట్టి.. ‘బంగార్రాజు’ కి వర్కౌట్ అవుతుంది. ఎప్పుడో స్టార్ట్ చేసిన సినిమాలకు మాత్రం మా ఫార్ములా వర్కవుట్ కాదు. మొన్న నేను చెప్పింది కూడా అదే. రేట్లు పెరిగితే మాకు బోనస్ అవుతుంది. పెరగకపోయినా మేము సేఫ్ అవుతాం. టికెట్ రేట్ల కోసం సినిమాలను విడుదల చేయకుండా ఉండలేం కదా. ఆల్రెడీ రెండేళ్ళు అయిపొయింది. నాకు బిగ్ బాస్ ఉంది కాబట్టి మధ్యలో పని దొరికింది లేదంటే కష్టమే కదా.
ప్ర.కరోనా కేసులు పెరుగుతున్నాయి. మీ సినిమా పై ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారా?
జ.కరోనా ఎంత ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుందో … దానికి గురైన వాళ్ళు అంతే ఫాస్ట్‌గా రికవర్ అవుతున్నారు. డాక్టర్లు చెబుతున్న మాట అదే.
ప్ర. ఈ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ అనేది 30 నిమిషాలు పైనే ఉంటుంది అన్నారు? అంత ఫాస్ట్ గా ఎలా పూర్తయ్యింది?
జ. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వర్క్ అంతా మా అన్నపూర్ణలోనే జరిగింది. వాటికి పనిచేసిన అనుభవం వాళ్లకి ఇక్కడ ఉపయోగపడింది.
ప్ర.కృతి శెట్టి పాత్ర ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది?
జ.కృతి శెట్టి చక్కగా తెలుగు నేర్చుకుంది. తెలుగులో మాట్లాడుతుంది. నాకు ఆమెలో నచ్చిన విషయం అదే .సెట్‌కి టైంకి వస్తుంది.ఈ సినిమాలో చూసినట్టు సర్పంచ్ నాగలక్ష్మీ పాత్రలా ఆమె బయట ఉండదు. బయట ఆమె చాలా క్లాస్‌గా కనిపిస్తుంది.
ప్ర. ఈరోజు చిరంజీవి గారు జగన్ గారిని కలవడానికి వెళ్లారు టికెట్ రేట్ల ఇష్యు గురించి? మీరు వెళ్ళలేదు ఎందుకు?
జ.ముఖ్యమంత్రి జగన్ గారిని కలవబోతున్నట్టు చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఎవరేం చేసినా సినిమా ఇండస్ట్రీ బాగు కోసమే. వెళ్ళమని చెప్పాను.నేను ‘బంగార్రాజు’ ప్రమోషన్స్‌లో ఉండటం వల్ల వెళ్లలేకపోయాను. వారం క్రితమే అపాయింట్మెంట్ చిరంజీవి గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు.