‘వార్ 2’ సినిమా గురించి ఎవరికీ ఏమీ చెప్పకుండానే ఇప్పటివరకు తెచ్చారు. సినిమా ముహూర్తం ఎప్పుడు జరిగింది, ఎప్పుడు షూటింగ్ చేశారు, ఎక్కడ షూటింగ్ చేశారు లాంటి వివరాలు ఏవీ బయటకు రాలేదు. ఫలానా సినిమా అని కూడా మొన్నటివరకు చెప్పలేదు. ఇప్పటివరకు వచ్చిన టీజర్, ట్రైలర్ చూశాక ఇది పాత కథే అని తేలిపోయింది. ఇద్దరు హీరోల మధ్య యుద్ధం అనేది అర్థమవుతోంది. అయితే ఎట్టకేలకు ఓ లీకు బయటకు వచ్చింది. లీక్ అనే కంటే టీజింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు.
ఎందుకంటే ఆ విషయాన్ని చెప్పింది ఓ హీరోయిన్. ఆమెనే ఆలియా భట్. ‘వార్ 2’ సినిమా ట్రైలర్‌ను ఆలియా భట్ షేర్ చేస్తూ ఆగస్టు 14న నాకు దగ్గరగా ఉండే థియేటర్లలో కలుద్దాం అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. దీంతో ఈ సినిమాలో ఆమె కూడా ఓ భాగం అని అనుకుంటున్నారు. ఆగస్టు 14న సినిమాను చూస్తారు అని రాసి ఉంటే ఈ డౌట్స్ రాకపోయేవి. కానీ ఆ రోజున మన థియేటర్లలో కలుద్దాం అని పెట్టింది. అంటే సినిమాలో ఆమె నటిస్తున్నట్లే లెక్క.
ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్‌కి హీరోయిన్‌గా కియారా అడ్వాణీ నటిస్తోంది అని మొన్న వచ్చిన టీజర్ చూస్తే అర్థమవుతోంది. అయితే తారక్‌కు హీరోయిన్ లేదు. ఇప్పుడు ఆలియా ఏమన్నా హీరోయిన్‌గా నటిస్తోందా అనే డౌట్ రావొచ్చు. అయితే అదేం కాదు శర్వరీ వాఘ్, ఆలియా కలసి నటిస్తున్న ‘ఆల్ఫా’ సినిమాకు బేస్‌గా ఈ సినిమాను తీసుకోబోతున్నారట. యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగానే ‘వార్ 2’, ‘ఆల్ఫా’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
అలాగే ‘ఆల్ఫా’లో ఆలియాకు గురువుగా హృతిక్ రోషన్ కనిపిస్తాడు అనే పాత పుకారు అలానే ఉంది. అంటే ‘వార్ 2’ నుండి ‘ఆల్ఫా’ సినిమాను కొనసాగిస్తారు అని చెప్పుకోవాలి. అంటే ‘వార్ 2’ క్లైమాక్స్‌లో మనం ఆలియా భట్‌ను చూడొచ్చన్నమాట.