ఓవైపు ‘అవతార్’ వచ్చింది.. మరోవైపు ‘వారణాసి’ సినిమాకు సంబంధించి ఆ మధ్య రాజమౌళి చెప్పిన కాన్సెప్ట్‌కి తగ్గట్టు కొత్తగా వచ్చిన ట్రైలర్. ఈ రెండూ రావడంతో సినిమా పరిశ్రమలో స్క్రీన్ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎలాంటి తెరలు ఉన్నాయి, వేటిలో చూస్తే సినిమా ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనమూ ఓసారి స్క్రీన్ల సంగతేంటో చూద్దాం. ఇక్కడ చెప్పే స్క్రీన్లన్నీ అందరికీ అందుబాటులో లేకపోవచ్చు కానీ.. సమాచారం అందుబాటులో ఉంది కాబట్టి తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం అన్ని ఊళ్లలో అందుబాటులో ఉన్న స్క్రీన్‌ని స్టాండర్డ్ స్క్రీన్ అంటారు. ఇది మామూలు థియేటర్లలో ఉండే ప్రొజెక్షన్. ఇలాంటి థియేటర్లలో సాధారణ సౌండింగ్ సిస్టమ్ లేదా డాల్బీ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఇక సినిమా చూస్తున్నప్పుడు సీట్లలో కదలికలు రావడం లాంటివి స్క్రీన్లు ఉంటాయి. వాటిని 4డీఎక్స్, ఎంఎక్స్4డీ అని అంటారు. యాక్షన్/ అడ్వెంచర్ సీన్లు ఉండే సినిమాలు ఈ థియేటర్లలో వేస్తుంటారు.
ఈ రెండూ కాకుండా డాల్బీ, డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో కొన్ని స్క్రీన్లు ఉన్నాయి. ఇందులో ఇమ్మెర్సివ్ టెక్నాలజీని వాడతారు. అంటే సినిమా చూస్తున్నప్పుడు ఆ ప్రపంచంలోకి మనం వెళ్లిన అనుభూతి కలుగుతుంది అని చెబుతున్నారు. ఇక మరొకటి ప్రీమియం ఎక్స్‌ట్రా లార్జ్ (పీఎక్స్‌ఎల్). వీటిలో తెరలు చాలా పెద్దగాఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్ ఇనార్బిట్ మాల్‌లో ఉంది. అయితే ఇది పూర్తి పీఎక్స్‌ఎల్ కాదు అని అంటున్నారు. అయితే బాలా నగర్ సమీపంలో ఒక పీఎక్స్‌ఎల్ రెడీ అవుతోందని సమాచారం.
ఇవన్నీ కాకుండా గతంలో హైదరాబాద్‌లో ఐమ్యాక్స్ స్క్రీన్ ఉండేది. అయితే ఇప్పుడు లేదు. త్వరలో హైదరాబాద్ నగర శివార్లలో ఓ స్టార్ హీరోకు చెందిన మల్టీప్లెక్స్‌లో ఐమ్యాక్స్ స్క్రీన్ ఉంటుందని టాక్. ఇందులో రాజమౌళి చెప్పినట్లు 1:43:1 ఫార్మాట్ స్క్రీన్ ఉంటుంది అని అంటున్నారు.