నందమూరి బాలకృష్ణ వందో చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, వైవిధ్య చిత్రాల దర్శకుడు క్రిష్ గౌతమి పుత్ర శాతకర్ణిలో నటసింహ ను కొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే మొరాకోలో కొన్నియుద్ధ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమాలోని కొన్ని పోరాట దృశ్యాలను చిలుకూరు బాలాజీ ఆలయ సమీపంలో షూట్ చేస్తున్నారు.
ఈ తాజా షెడ్యూల్ లో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ జాయిన్ అయ్యాడు. నేటి (బుధవారం) నుంచి క్రిష్ వద్ద ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ నేర్చుకోనున్నాడు. అయితే అతను డైరక్షన్ డిపార్ట్ మెంట్ కే పరిమితం కాడని.. సినిమా నిర్మాణంలోని కష్టనష్టాలను ప్రాటికల్ గా తెలుసుకోవడానికి టెక్నీషియన్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నట్లు బాలకృష్ణ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
దీంతో నటుడు ఎంత క్రమ శిక్షణతో ఉండాలో.. హీరో వెనుకాల ఎందరి శ్రమ ఉంటుందో కొడుకుకి తెలియాలని బాలకృష్ణ ఈ ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మోక్షజ్ఞ హీరోగా పరిచయమయ్యే సినిమా చర్చలు మొదలవుతాయని సమాచారం. నందమూరి నవ యువ సింహం చిత్రాన్ని నిర్మించే బాధ్యతను సాయి కొర్రపాటి తీసుకున్నట్లు తెలిసింది.